టీడీపీకి డొక్కా రాజీనామా

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ కూడా రాశారు.

ఎమ్మెల్సీగా ఉన్న డొక్కకు 2019లో పత్తిపాడు అసెంబ్లీ టికెట్‌ను ఆఖరి నిమిషంలో కేటాయించారు. తాను ఓటమిపాలవుతానని తెలిసినా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ చేశానని చెప్పారు.

ఇక గత కొంత కాలంగా వైసీపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు ఓటింగ్ సందర్భంగా డొక్కా దూరంగా ఉన్నారు. అంతే కాకుండా ఆ సమయంలో సీఎం జగన్‌తో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు.

ఈ పరిణామాల నేపథ్యంలో డొక్కా ఆనాడే పార్టీ మారతారని అనుకున్నారు. దీనిపై డొక్కా వివరణ ఇస్తూ.. వైసీపీ నేతలతో తాను ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో మండలి సమావేశాలు వివాదాస్పదం అవుతాయనే తాను హాజరు కాలేదని చెప్పుకొచ్చారు.