చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా గండం?

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చంద్రబాబుకు, టీడీపీకి గట్టి షాకిస్తూ వైసీపీకి మద్దతు పలికారు. ఈ పరిణామంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు ఆ పదవీ గండం ప్రారంభమైందని మీడియాలో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఏపీలో 23మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా పొందారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 175మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో పదోవంతు సీట్లు దక్కించుకుంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంటే 18మంది ఎమ్మెల్యేలు దాటితే ప్రతిపక్ష హోదా ఉంటుంది.దీంతో కేబినెట్ ర్యాంకు, మంత్రి హోదా, అసెంబ్లీలో ప్రత్యేక గది, ఇతర సామగ్రి, జీతభత్యాలు కూడా ఇస్తారు.

ప్రస్తుతం ఏపీలో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఇప్పటికే ముగ్గురు వైసీపీకి మద్దతు పలికారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి జై కొట్టారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి విధేయత చాటుతున్నారు. దీంతో టీడీపీ బలం అసెంబ్లీలో 17కు తగ్గుతుంది. దీంతో చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోల్పోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

మరో ముగ్గురైన గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్, గద్దె రాంమోహన్ లు టీడీపీ ని వీడి వైసీపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తరుఫున మళ్లీ గెలిస్తే తప్ప రికార్డుల ప్రకారం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతు కావడం అసాధ్యం.

అయితే మూడింట రెండొంతుల మంది టీడీపీ సభ్యులు వైసీపీలోకి వస్తే, తిరుగుబాటు చేస్తే టీడీపీని వైసీపీలో విలీనం చేసుకొని చంద్రబాబు ప్రతిపక్ష హోదాను తీసేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం 16మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేయాల్సి ఉంటుంది.