భార‌త్‌లో రెండో క‌రోనా మృతి – కర్నాట‌క‌లో మాల్స్‌, థియేట‌ర్స్ బంద్‌

దేశంలో క‌రోనా సైలెంట్‌గా విస్త‌రిస్తోంది. అధికారికంగా ఇప్ప‌టివ‌ర‌కూ 81 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో ఇద్ద‌రు మృతి చెందారు. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల వృద్దురాలు క‌రోనా వైర‌స్‌తో చ‌నిపోయారు. ఢిల్లీలో ఈమె 6వ క‌రోనా కేసుగా న‌మోద‌య్యారు. అయితే ఈమెకు హై బ్ల‌డ్ ప్రెష‌ర్‌తో పాటు షుగ‌ర్ ఉండడం ప్ర‌మాద‌క‌రంగా మారింది. దీంతో ఈమె చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు.

కర్నాట‌క‌కు చెందిన 76 ఏళ్ల వృద్దుడు క‌రోనాతో చ‌నిపోయాడు. ఇదే దేశంలో క‌రోనాతో చ‌నిపోయిన తొలి కేసు. ఇప్పుడు ఢిల్లీలో రెండో వ్య‌క్తి మృతి చెందారు. ప్ర‌పంచవ్యాప్తంగా దాదాపు ఐదువేల‌కు పైగానే క‌రోనా ప్ర‌భావంతో చ‌నిపోయారు.

దేశ‌వ్యాప్తంగా దాదాపు 42 వేల మంది క‌రోనా అనుమానితుల‌ను గుర్తించారు. వీరికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ అధికారులు చెప్పారు.

మ‌రోవైపు తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ సోకిన మ‌హీంద్ర‌హిల్స్‌కు చెందిన వ్య‌క్తిని గాంధీ నుంచి డిశ్చార్జ్ చేశారు. రాత్రి మీడియా కంట‌ప‌డకుండా ఆయ‌న గాంధీ నుంచి వెళ్లిపోయారు.

క‌రోనా మృతులు న‌మోదు కావ‌డంతో కర్నాట‌క ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. బెంగ‌ళూరుతో పాటు ప‌లు న‌గ‌రాల్లో షాపింగ్‌మాల్స్ ,సినిమా థియేట‌ర్లు, ప‌బ్‌లు, స్విమ్నింగ్ పూల్స్‌తో పాటు జ‌నాలు తిరిగే ప్రాంతాల‌ను వారం రోజుల పాటు మూసివేయాల‌ని ఆదేశించింది. బీహార్‌, ఢిల్లీ, యూపీ, జ‌మ్మూకాశ్మ‌ర్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా రాష్ట్రాలు వారం రోజుల పాటు స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి.