తెలుగు సినిమాపై కరోనా దెబ్బ

ఈనెల 21 వరకు సినిమా హాళ్లు మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కువ మల్టీప్లెక్సులు ఉన్నది తెలంగాణలోనే కాబట్టి సినిమా పరిశ్రమకు ఇది పెద్ద నష్టం తీసుకురావడం గ్యారెంటీ. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక్కటే కాదు, కరోనా ప్రభావంతో చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరికొన్ని షూటింగ్స్ ఆపేశాయి. మొత్తంగా టాలీవుడ్ పై కరోనా దెబ్బ గట్టిగా పడింది.

కరోనా ప్రభావంతో తన సినిమా ఆపేస్తున్నట్టు ప్రకటించారు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వంద మందికి పైగా టెక్నీషియన్స్ తో కూడుకున్న పని కాబట్టి, తన టీమ్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్య షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు చిరంజీవి

అటు బన్నీ హీరోగా రావాల్సిన సినిమా షూటింగ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. లెక్కప్రకారం, ఈపాటికి కేరళలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వాలి. కానీ అక్కడ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అందుకే షూటింగ్ కాన్సిల్ చేశారు. మామిడిమిల్లి అటవీప్రాంతంలో షూటింగ్ చేయాలని భావించినా, ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసుకున్నారు

పవన్ కల్యాణ్ నటిస్తున్న పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. మరో 4 రోజుల్లో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలవ్వాలి. కరోనా కారణంగా ఆ షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. కరోనా దెబ్బకు ఇప్పటికే నాని, సుధీర్ బాబు నటించిన V సినిమా వాయిదా పడింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజ్ తరుణ్, ప్రదీప్ మాచిరాజు నటించిన సినిమాలు కూడా వాయిదాపడ్డాయి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాల ప్రదర్శనలన్నీ నిలిచిపోయాయి.