కరోనా ఎఫెక్ట్…. ఒకే వేదికపైకి భారత్-పాక్

భారత్, పాకిస్థాన్ లను కరోనా వైరస్ ప్రభావం.. ఓ మాట మీదకు తెచ్చింది. కొన్నాళ్లుగా ఏ వేదిక అయినా.. ఎలాంటి సమావేశం అయినా ముఖాముఖి మాట్లాడుకునేందుకు ఇరు దేశాలు నిరాకరించుకుంటున్న తరుణంలో.. కరోనా ప్రభావం ఈ రెండు దేశాలను ఒకే వేదికపైకి తెచ్చింది. కాకపోతే.. ముఖాముఖి మాత్రం కాదులెండి… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిసేందుకు సార్క్ లో భాగమైన ఇతర దేశాలతో కలిసి సరేనంది.

కరోనాపై పోరాటానికి ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు సార్క్ కూటమి నేతలు నేడు వీడియో కాన్ఫరెన్స్ తో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీనే ఇందుకు చొరవ తీసుకున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనాను ఎలా నివారించవచ్చుననే అంశంపై సభ్య దేశాలు చర్చించి ఓ ప్రణాళిక ఖరారు చేయనున్నాయి. ఇప్పటికే దేశంలో తీసుకుంటున్న చర్యలను ప్రధాని తోటి దేశాలకు వివరించనున్నారు.

ఆయా దేశాల్లో ఎలాంటి చర్యలు అమలు అవుతున్నాయి.. ఎన్ని కేసులు నమోదయ్యాయి.. మరణాల తీరు ఎలా ఉంది.. వైరస్ వ్యాప్తి ప్రభావం పరిస్థితి ఏంటి? ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది? అన్న పూర్తి విషయాలను సార్క్ దేశాధినేతలు పంచుకోనున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం.. దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. స్కూళ్లు, సినిమాహాళ్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇతరత్రా జనసమ్మర్థం ఉన్న అన్నింటినీ మూసేస్తున్నాయి. తాజాగా.. సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత.. మరిన్ని కఠిన చర్యలను కేంద్రం అమలు చేసే అవకాశం ఉంది.