ఇండియన్ సాకర్ లీగ్ లో ఏటీకే హ్యాట్రిక్

  • ఫైనల్స్ లో చెన్నైయాన్ పై 3-1 గోల్స్ తో గెలుపు

ఇండియన్ సాకర్ లీగ్ 2020 సీజన్ విజేతగా సౌరవ్ గంగూలీకి చెందిన అట్లెటికో కోల్ కతా మూడోసారి నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గోవాలోని ఫడోద్రా నెహ్రూ స్టేడియం గేట్లు మూసి, అభిమానులు లేకుండా నిర్వహించిన ఫైనల్సో మాజీ చాంపియన్ చెన్నైయాన్ ను 3-1 గోల్స్ తో కోల్ కతా చిత్తు చేసింది.

ఏకఫక్షంగా సాగిన ఈ టైటిల్ సమరంలో కోల్ కతా జట్టుకు ఎదురేలేకపోయింది. ఆట 10వ నిముషంలోనే కోల్ కతా స్టార్ ప్లేయర్ జేవియర్ హెర్నాండేజ్ తొలిగోల్ తో 1-0 ఆధిక్యం అందించాడు. ఆట రెండో భాగంలో ఎడు గార్షియా, జేవియర్ చెరోగోలు సాధించి కోల్ కతా విజయం ఖాయం చేశారు. చెన్నైయాన్ తరపున వాలెసిక్ గోల్ సాధించినా ప్రయోజనం లేకపోయింది.

గత ఆరుసీజన్లలో కోల్ కతా టైటిల్ విన్నర్ గా నిలవడం ఇది మూడోసారి. మరోవైపున చెన్నైయాన్ రెండుసార్లు విజేతగా నిలిచింది. మొత్తం ఆరు లీగ్ ల్లో మూడుసార్లు కోల్ కతా, రెండుసార్లు చెన్నైయన్ విజేతలుగా నిలవడం చూస్తే… ఎనిమిదిజట్ల ఈ లీగ్ …కేవలం కోల్ కతా, చెన్నై షోగానే సాగినట్లుగా గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.

భారత ఫుట్ బాల్ చరిత్రలో జనంలేకుండా గేట్లు మూసి నిర్వహించిన తొలి ఫైనల్స్ ఇదే కావడం విశేషం. సాధారణంగా గోవాలో ఫుట్ బాల్ ఫైనల్స్ జరిగితే 50 నుంచి 70 వేల మంది అభిమానులు హాజరుకావడం సాధారణ విషయం. అయితే కరోనా వైరస్ దెబ్బతో…కేవలం రెండుజట్ల ఆటగాళ్లు, అంపైర్లు, నిర్వాహక సంఘం ప్రతినిధులు, మీడియా ప్రతినిథులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించారు.