సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ సంచలన తీర్మానం.. కేసీఆర్ ఏమన్నారంటే?

తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నంత పనిచేశారు. నాలుగో రోజు సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే నేటి సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చర్చను పెట్టారు. ఈ సందర్భంగా సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.

ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ ఫిబ్రవరి 16న తీర్మానం కూడా చేసింది. ఇప్పటికే కేరళ, బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, డిల్లీలు కూడా అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకించి తీర్మానం చేశాయి.

సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సందర్భంగా కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఏఏపై దేశంలో సమీక్ష జరగాలని.. తాము గుడ్డిగా దీన్ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింల సమస్య సీఏఏ కాదన్నారు.

సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులు అవుతారని బీజేపీ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. దేశం మంచివైపు నడవాలని… అందుకే పార్లమెంట్ లోనూ ఈ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించిందని అన్నారు. ప్రజల భావోద్వేగాలను బీజేపీ రెచ్చగొట్టడం సరైంది కాదని స్పష్టం చేశారు.

దేశంలో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ లేదని.. తనకు కూడా బర్త్ సర్టిఫికెట్ లేదని.. తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని బీజేపీ తీరును అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఎండగట్టారు.