Telugu Global
NEWS

అనుకోని అవకాశం.... బాగా క్యాష్ చేసుకుంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడే సరికి.. రాజకీయాలు కాస్త శాంతించాయనుకుంటే.. అంతలోనే మళ్లీ వేడెక్కాయి. అధికార, విపక్షాల మధ్య మాటల దాడి తీవ్రమైంది. ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలియగానే.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి లోనైంది. అసలే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పైగా.. జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్య ప్రభావం ఉంది. ఇంతలోనే నేనున్నా అంటూ కరోనా తరుముకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మార్చిలోగా స్థానిక […]

అనుకోని అవకాశం.... బాగా క్యాష్ చేసుకుంటున్న టీడీపీ
X

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడే సరికి.. రాజకీయాలు కాస్త శాంతించాయనుకుంటే.. అంతలోనే మళ్లీ వేడెక్కాయి. అధికార, విపక్షాల మధ్య మాటల దాడి తీవ్రమైంది. ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలియగానే.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తికి లోనైంది. అసలే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పైగా.. జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్య ప్రభావం ఉంది.

ఇంతలోనే నేనున్నా అంటూ కరోనా తరుముకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మార్చిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే.. కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. వడివడిగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇలాంటి తరుణంలో ఎన్నికలు వాయిదా వేస్తే.. ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందే. అందుకే సీఎం జగన్ అంతగా సీరియస్ అయినట్టు కనిపించింది.

ఇదే అదునుగా.. చంద్రబాబు అండ్ కో టైం చూసి వైసీపీని దెబ్బ కొట్టేందుకు రంగంలోకి దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం అవుతున్న వేళ.. పార్టీ ఉనికికి దెబ్బ పడే సమయం ముంచుకొస్తున్న వేళ.. అనుకోని అవకాశంలా.. ఈ వాయిదా వ్యవహారాన్ని టీడీపీ వాడుకుంది. జగన్ అలా ప్రెస్ మీట్ పెట్టగానే.. ఇలా చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు.. మీడియాను, సామాజిక మాధ్యమాలను చుట్టుముట్టారు.

పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో జగన్ ప్రభుత్వంపై మాటల దాడికి దిగారు. విమర్శలతో సతమతం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. బొత్స వంటి మంత్రులు, విజయసాయి రెడ్డి వంటి అగ్ర నేతలు వారికి తగిన కౌంటర్ ఇచ్చినా.. పరిస్థితి గమనిస్తుంటే.. మాటల దాడులు మరింత ముదిరేలాగే కనిపిస్తున్నాయి. ఎన్నికలు లేకున్నా.. అంతకు మించిన వేడి రాష్ట్ర రాజకీయాలను మండించేలాగే ఉంది.

First Published:  16 March 2020 1:12 AM GMT
Next Story