Telugu Global
National

సంజయ్, అరవింద్.... తెలంగాణ మోడీ, అమిత్ షా!

తెలంగాణ బీజేపీలో నాయకులు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. సంఘ్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి.. అధికార పార్టీపై మాటల దాడిని తీవ్రం చేశారు. బండికి అత్యంత సన్నిహితుడు, తన సామాజిక వర్గానికే చెందిన మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా.. సంజయ్ కు తల్లో నాలుకలా మెలుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జాతీయ స్థాయిలో బీజేపీకి మోడీ, అమిత్ షా ద్వయం ఎలాగో.. రాష్ట్రానికి సంజయ్, అరవింద్ […]

సంజయ్, అరవింద్.... తెలంగాణ మోడీ, అమిత్ షా!
X

తెలంగాణ బీజేపీలో నాయకులు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. సంఘ్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి.. అధికార పార్టీపై మాటల దాడిని తీవ్రం చేశారు. బండికి అత్యంత సన్నిహితుడు, తన సామాజిక వర్గానికే చెందిన మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా.. సంజయ్ కు తల్లో నాలుకలా మెలుగుతున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. జాతీయ స్థాయిలో బీజేపీకి మోడీ, అమిత్ షా ద్వయం ఎలాగో.. రాష్ట్రానికి సంజయ్, అరవింద్ అలా తయారవుతున్నారన్న అభిప్రాయం పార్టీ నాయకత్వంలో బలంగా వినిపిస్తోంది. ఓ తరం నాయకత్వం దాటి చాలా రోజులవుతున్న తరుణంలో.. ఈ ఇద్దరు బీజేపీని బలపరిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండడం పార్టీకి తెలంగాణలో జవసత్వాలు తీసుకువస్తోందని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.

అందుకు తగినట్టే.. కేసీఆర్ ప్రభుత్వంపై మాటల దాడిని నేతలు తీవ్రం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని.. అలాంటి వ్యాఖ్యలకు సంజయ్ నాయకత్వంలో పని చేసి అద్భుత ఫలితాలు సాధించి చూపించాలని.. టీఆర్ఎస్ ముక్కు కోయాలని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు పీసీసీ చీఫ్ గా పని చేసినప్పుడు ఎంత సంతోషించానో.. సంజయ్ కు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు దక్కడంపైనా అంతే సంతోషంగా ఉందని అన్నారు.

ఈ జోరు చూస్తుంటే.. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ జోడీ.. తెలంగాణ బీజేపీలో సరికొత్త నాయకత్వ ద్వయంగా తయారయ్యేందుకు భూమిక ఏర్పరుచుకున్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి నేతలు… మార్గదర్శక పాత్రకు పరిమితం అయ్యే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  16 March 2020 1:10 AM GMT
Next Story