సీఎం జగన్ రిక్వెస్ట్… ధరలు తగ్గించిన సిమెంట్ కంపెనీలు

ఏపీలో పేదలకు కట్టించే ఇళ్లకు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు, పోలవరం ప్రాజెక్టుకు వాడే సిమెంటు ధరలను తగ్గించడానికి సిమెంటు కంపెనీలు అంగీకారం తెలిపాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సిమెంటు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్లో 380 రూపాయల వరకు పలుకుతున్న సిమెంటును ఇకపై ప్రభుత్వానికి తక్కువ ధరకే ఇవ్వనున్నాయి. పీపీసీ బస్తా 225 రూపాయలు, ఓపీసీ బస్తా 235 రూపాయలకు ఇస్తామని చెప్పాయి. గత ఐదేళ్ల ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు ఇస్తామన్న ధరలు చాలా తక్కువే.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్ కంపెనీ యజమానులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పనుల నిమిత్తం అవసరమయ్యే సిమెంటు వివరాలను ఆయా కంపెనీలకు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో పంచాయితీరాజ్ శాఖకు 25 లక్షల మెట్రిక్ టన్నులు, గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్ టన్నులు, జల వనరుల శాఖకు 16.57 లక్షల మెట్రిక్ టన్నులు, మున్సిపల్ శాఖకు 14.93 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కానుంది. ఇక మిగిలిన శాఖలకు అవసరమయ్యే సిమెంటుతో కలిపి మొత్తం 1,29,43,237 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం ప్రభుత్వానికి ఉంది.

రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంతో పాటు పేదలకు కట్టించనున్న ఇండ్లకు అవసరమయ్యే సిమెంటే ఇదంతా. ధరలు ఎక్కువగా ఉంటే నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని.. ప్రభుత్వంపై భారం పడకుండా సిమెంటు కంపెనీలు కొంత రాయితీ ఇస్తే మంచిదని సీఎం జగన్ వారిని కోరారు. రాబోయే రోజుల్లో పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని.. వాటితో పాటు ఇప్పటికే పట్టాలున్న పేదలు, సొంత స్థలాలున్న పేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టివ్వనున్నట్లు చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అయితే బాగుంటుందని అన్నారు.

కాగా, రాయితీ సిమెంటు పక్కదారి పట్టకుండా ప్రత్యేకమైన రంగులో బ్యాగులను తయారు చేయాలని ఆయన కోరారు. ప్రతీ ప్రభుత్వ శాఖ జిల్లా కలెక్టర్ల ద్వారా ఇండెంటు పంపుతాయని.. కలెక్టర్ నాణ్యతా నిర్థారణ చేసిన తర్వాతే కంపెనీలకు చెల్లింపులు చేస్తామని సీఎం చెప్పారు.

అయితే, సీఎం జగన్ అభ్యర్థనను విన్న కంపెనీ యజమానులు, ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ అవసరాల మేరకు సిమెంటు పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. పేదల ఇండ్ల నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిమెంటు సరఫరా చేస్తామన్నారు. ఈ సమావేశంలో జువారి సిమెంట్, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ, శ్రీ చక్ర, ఇండియా, మై హోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్యా బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్‌ తదితర కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు.