ఎన్నికలకు కరోనా ఉంటుందా… అమరావతి ఆందోళనలకు ఉండదా?

చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతం.. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యింది. ఆ సిద్ధాంతం.. చివరికి టీడీపీ పుట్టి ముంచింది. తెలంగాణలో చిరునామా లేకుండా చేసింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ అంతర్థానమయ్యే దశకు చేర్చింది. ఇలాంటి సందర్భాల్లోనూ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే సమర్థుడు చంద్రబాబు అని మరోసారి రుజువైంది.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై.. ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంపై చంద్రబాబు స్పందించిన తీరు చూస్తే.. రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్న ఎవరికైనా సరే.. మళ్లీ రెండు నాలుకల సిద్ధాంతం గుర్తుకు రాక మానదు. ఎందుకంటే.. ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలంతా గుమిగూడాల్సి వస్తుంది కాబట్టి.. కరోనా ప్రభావంతో ఇబ్బంది తలెత్తదా.. ఆ మాత్రం ఆలోచన లేదా.. అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు.

కానీ.. అదే ప్రజలు గుమిగూడటం అన్నది అమరావతి ఆందోళనలకు వర్తించదా.. అన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీ వర్గాల నుంచి బలంగా వ్యక్తమవుతోంది. టీడీపీతోపాటు.. వారి అనుకూల వర్గాల ప్రోద్బలంతో జరుగుతున్న ఈ ఆందోళనల్లో.. కరోనా ప్రభావంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అమరావతి ఆందోళనలకైతే ఓ న్యాయం.. స్థానిక సంస్థల ఎన్నికలకైతే మరో న్యాయమా అని వైసీపీ నాయకులే కాదు.. సామాన్యులు కూడా చంద్రబాబు తీరును నిలదీయాల్సి వస్తోంది.

సహజంగానే.. టీడీపీ నేతలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. అందుకే.. స్థానిక సంస్థలకు, కరోనా వైరస్ కు ముడి పెట్టి కౌంటర్లు ఇవ్వడం.. ఆ పార్టీ నేతల వ్యాఖ్యల్లో చాలా వరకు తగ్గిపోయింది.