మెగాస్టార్ సరసన అనుష్క?

ఎప్పుడైతే ఆచార్య ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు త్రిష ప్రకటించిందో ఆ వెంటనే కాజల్ పేరు తెరపైకి వచ్చింది. ఖైదీ నంబర్ 150లో చిరు సరసన నటించిన కాజల్ ను మరోసారి రిపీట్ చేసేందుకు రామ్ చరణ్ తో పాటు అంతా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఈసారి కాజల్ కాస్త బెట్టు చేసింది. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం.. 2 కోట్ల రూపాయలు అడిగినట్టు తెలుస్తోంది. దీంతో మేకర్స్ అనుష్కను సంప్రదించారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సరసన అనుష్క నటించడం దాదాపు ఖాయం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఈమధ్యే ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది అనుష్క. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. తనకు నచ్చిన హీరో చిరంజీవి అని ప్రకటించింది, చిరుతో నటించడం కుదరడం లేదనే బాధను కూడా వ్యక్తంచేసింది.

అనుష్క ఇలా ప్రకటించిన కొన్ని రోజులకే ఆమెకు ఆచార్య అవకాశం రావడం విశేషం. ఇంతకుముందు చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో అనుష్క ఐటెంసాంగ్ చేసింది. రీసెంట్ గా చిరు చేసిన సైరా సినిమాలో అనుష్క ఓ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ.