నిజమైన శ్రీమంతుడు

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన మూలాలను మరువకూడదు. మన ఇల్లు మన ఊరు అనేవి ఎప్పటికీ ఉండే జ్ఞాపకాలు. అందుకే మనకు ఎంతో ఇచ్చిన ఊరికి ఎంతో కొంత ఇవ్వాలనే కాన్సెప్టుతో శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది. కాని రియల్ లైఫ్‌లో కూడా కొంత మంది శ్రీమంతులు ఉంటారు. అలాంటి వ్యక్తే కామిడి నర్సింహారెడ్డి.

వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేటకు చెందిన నర్సింహారెడ్డి తన ఊరికి ఏమన్నా చేయాలని తలంచారు. వెంటనే 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఊరికి ఏం కావాలో ప్రభుత్వానికి తెలుసు కాబట్టి తొలి విడతగా 1.5 కోట్ల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ప్రభుత్వమే ఊరికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అందుకు తాను ప్రకటించిన సాయాన్ని విడతల వారీగా అందిస్తానని ఆయన మంత్రికి చెప్పారు.

కామిడి నర్సింహారెడ్డి ఔదార్యానికి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. నర్సింహారెడ్డిలా ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి గ్రామాల అభివృద్దికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

కొసమెరుపు ఏమిటంటే… శ్రీమంతుడిలా… అంతా దాచుకోకుండా కొంత సమాజానికి ఇవ్వాలన్న కాన్సెప్ట్ ను ప్రచారం చేసిన వ్యక్తులే తమ ఊరిని ఉద్దరించడానికి ట్రస్టులు పెట్టి చందాలు సేకరించడం, ప్రభుత్వాన్నే ఆర్థిక సాయం చేయమని కోరడం… లాంటి ఘటనలు చూస్తున్న మనకు ఒక అనామకుడైన వ్యక్తి ఇంత దాతృత్వాన్ని చూపించి తమ గ్రామం కోసం 25 కోట్లు ఇవ్వడం నిజంగా అభినందించదగిన విషయం.