విధినే ఎదురించి విజేతగా నిలిచిన ధీర

  • స్పూర్తి దాయకం మానసీ జీవితం
  • కృత్రిమ కాలితో ప్రపంచ టైటిల్ నెగ్గిన మానసీ జోషీ

పీవీ సింధు…మానసీ జోషీ. ఇద్దరూ ఒకే వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలలో విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళలు. ఒకరు రెండుకాళ్లతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఆడి టైటిల్ నెగ్గితే…మరొకరు కృత్రిమ కాలితో విశ్వవిజేతగా నిలిచిన ధీర. అయితే…రెండుకాళ్ళున్న పీవీ సింధుకు ఇచ్చిన ప్రచారం, ప్రాధాన్యం.. మన మీడియా…ఒంటికాలికి తోడు కృత్రిమకాలు ధరించిన మానసీ జోషీకి ఇవ్వలేదు.

అయితేనేం…విధి చిన్నచూపు చూసినా, అదృష్టం వక్రీకరించినా, రోడ్డు ప్రమాదంలో తగిలిన గాయంతో ఎడమకాలు కోల్పోయినా భీతి చెందలేదు, నిరాశకు ఏమాత్రం గురికాలేదు. ఇష్టమైన రంగంలో విశ్వవిజేతగా నిలవడానికి అంగవైకల్యం ఏమాత్రం అవరోధంకాదని తన అపురూప విజయాలతో మానసి జోషీ చాటుకొంది.

2011లో ఘోరప్రమాదం…

గుజరాత్ కు చెందిన మానసి తండ్రి ప్రేరణతో ఆరేళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ర్యాకెట్ చేతపట్టింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతూనే… బ్యాడ్మింటన్ ఆడుతూ, శిక్షకురాలిగా ఉంటూ తన కెరియర్ ను కొనసాగించింది.

2011లో తన బైక్ మీద వెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఎడమకాలు కోల్పోయింది. ప్రాణం నిలుపుకోవాలంటే కాలు తీసివేయక తప్పదని వైద్యులు చెప్పడంతో… ఎడమకాలిని కోల్పోవాల్సి వచ్చింది.

మరెవరైనా అయితే…కాలులేదంటేనే ప్రాణమే పోయినట్లుగా, జీవితం ఇక వ్యర్థమేనన్నట్లుగా బాధపడటం, జీవితమే తలకిందు లైనట్లు బెంబేలెత్తిపోడం సాధరణ విషయమే. అయితే… మానసీ జోషీ మాత్రం నిరాశను ఏమాత్రం దరి చేరనివ్వలేదు. జీవితం జీవించడానికే, బాధపడటానికి ఏమాత్రం కాదన్న వాస్తవాన్ని చాలా త్వరగానే గ్రహించింది.

కృత్రిమ కాలితోనే పోరాటం…

రెండుకాళ్ళతో పాటు పూర్తి ఫిట్ నెస్ ఉంటేనే బ్యాడ్మింటన్ ఆడటం అంతతేలికకాదు. అయితే ..మానసి మాత్రం తన కిష్టమైన బ్యాడ్మింటన్ ను కొనసాగించాలని నిర్ణయించింది.

పైబర్ బ్లేడ్లతో…ప్రత్యేకంగా తనకోసమే, బ్యాడ్మింటన్ ఆడటానికి వీలుగా రూపొందించిన కృత్రిమ పాదాన్ని ధరించి మరీ…తన బ్యాడ్మింటన్ పోరాటం కొనసాగించింది.

అంగవికలుర కోసం జరిగే పారా ఒలింపిక్స్ తో పాటు..పారా బ్యాడ్మింటన్ పోటీలకు సాధన చేయడం మొదలుపెట్టింది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సహకారంతో…హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడెమీలో తన ఆటకు పదునుపెట్టుకొంది.

ఒంటికాలితో … కుడికాలి పైనే పూర్తి భారం వేసి బ్యాడ్మింటన్ ఎలా ఆడాలో తాను గోపీచంద్ అకాడెమీలోనే నేర్చుకొన్నానని, తనకోసం ప్రత్యేక వీడియోలతో శిక్షణ ఇచ్చిన గోపిచంద్ కు ఎంతైనా రుణపడి ఉంటానని మానసీ కృతజ్ఞత తెలిపింది. అహ్మదాబాద్ లోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తోంది.

2015లో తొలి పతకం..

2011లో ఎడమకాలిని కోల్పోయిన మానసి…2015లో పారా బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటూ వచ్చింది. లండన్ వేదికగా ముగిసిన స్టోక్ మాండివెల్లీ ప్రపంచ టోర్నీలో  రజత పతకం సంపాదించింది.

2016 ఆసియా పారా బ్యాడ్మింటన్లో కాంస్య పతకం గెలుచుకొంది. 2017 లో దక్షిణ కొరియాలోని ఉల్సాన్ వేదికగా ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్లో కాంస్య పతకం నెగ్గిన మానసి.. 2019లో స్విట్జర్లాండ్ లోని బాసెల్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో బంగారు పతకం సాధించింది.

ఆసియా పారా గేమ్స్, ప్రపంచ పారా గేమ్స్ బ్యాడ్మింటన్లో పతకాలు సాధిస్తూ వచ్చిన మానసీ..ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ పారా బ్యాడ్మింటన్ మిక్సిడ్ డబుల్స్ లో.. రాకేశ్ పాండేతో జంటగా అర్హత సాధించాలన్న పట్టుదలతో సాధన చేస్తోంది. విధినే ఎదురించి విజేతగా నిలిచిన మానసీ జోషీ జీవితం ఓ స్ఫూర్తిదాయక గాథగా మిగిలిపోతుంది.