తెలుగులో మ‌రో కొత్త న్యూస్ చాన‌ల్ !

తెలుగులో మ‌రో కొత్త న్యూస్ చాన‌ల్ రాబోతోంది. తెలుగు న్యూస్ చానెల్ మార్కెట్‌లోకి తొలిసారి ఓ జాతీయ చాన‌ల్ అడుగుపెట్ట‌బోతోంది. ఇప్ప‌టికే ఏబీపీ పేరుతో హిందీ చాన‌ల్ న‌డుపుతున్న ఏబీపీ నెట్‌వ‌ర్క్ తెలుగు మార్కెట్‌పై క‌న్నేసింది. ఏబీపీ నెట్‌వ‌ర్క్ కింద మ‌రాఠీ, బెంగాలీ, గుజ‌రాతీ, పంజాబీ, ఉత్త‌ర‌ప్రదేశ్ కోసం ప్ర‌త్యేకంగా గంగా చాన‌ల్ న‌డుపుతోంది. ఏబీపీ నెట్‌వ‌ర్క్ కింద ప్ర‌స్తుతం ఆరు చానెల్స్ ఉన్నాయి. ఏబీపీ నెట్‌వ‌ర్క్‌ను విస్త‌రించే ప‌నిలో ప‌డింది.

గ‌త ఏడాది ఎన్నిక‌ల ముందు ఏబీపీ కొత్తగా నాలుగు చానెళ్ల లైసెన్స్ తీసుకుంది. ఏబీపీ ఆంధ్ర‌, ఏబీపీ గంగా, ఏబీపీ క‌న్న‌డ‌, ఏబీపీ త‌మిళ్ పేరుతో లైసెన్స్‌, శాటిలైట్ సిగ్న‌ల్స్ పొందింది. వీటిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ కోసం డిజైన్ చేసిన ఏబీపీ గంగా ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. గ‌త ఏడాది ఏప్రిల్ 15న లైవ్‌లోకి వ‌చ్చింది. ఇక మిగ‌తా మూడు చానెల్స్ ద‌క్షిణాదికి చెందిన‌వి.

సౌత్ మార్కెట్‌పై ఇప్ప‌టికే అధ్య‌య‌నం చేసిన ఏబీపీ య‌జ‌మాన్యం…ఈ ఆర్ధిక సంవత్స‌రంలో ఇక్క‌డ అడుగుపెట్టాల‌ని ప్లాన్‌లు వేస్తోంది. తెలుగు చానెల్ హెడ్ కోసం ఇప్ప‌టికే ఏబీపీ నెట్‌వ‌ర్క్ అన్వేషిస్తోంద‌ట‌. ఇందులో భాగంగా ప‌దిమందికి పైగా షార్ట్ లిస్ట్ చేసింద‌ట‌. ఆ త‌ర్వాత ఫైన‌ల్‌గా న‌లుగురిని ఎంపిక చేసింద‌ట‌. వీరిలో ఒక‌రిని ఎంపిక చేస్తుంద‌ట‌. హెడ్ ఎంపిక త‌ర్వాత న్యూస్ చాన‌ల్ సిబ్బంది నియామ‌కం స్పీడ్ అందుకుంటుంద‌ట‌.

తెలుగు న్యూస్ చానెల్ మార్కెట్‌లో ఇప్పుడు చానెళ్లు పార్టీలు వారీగా విడిపోయాయి. ఏ చాన‌ల్ ఏ పార్టీ కొమ్ముకాస్తుందో జ‌నాల‌కు తెలిసిపోయింది. దీంతో ఇప్పుడు న్యూట్ర‌ల్‌గా ఉండే చాన‌ల్‌కు స్పేస్ ఏర్ప‌డింది. ఇది గ‌మ‌నించిన ఏబీపీ చాన‌ల్ సౌత్ ఇండియా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు త‌న నెట్‌వ‌ర్క్ వీక్ష‌కుల‌ను పెంచుకోవ‌డంతో పాటు డిజిట‌ల్ మీడియా మార్కెట్‌ను పెంచుకోవ‌డానికి ఏబీపీ ఈ సౌత్ వైపు చూస్తోంద‌ట‌. మొత్తానికి ఇప్ప‌టికే తెలుగులో ప‌లు చానెళ్లు మూత‌ప‌డే ప‌రిస్థితిలో ఉంటే….కొత్త‌గా చానెల్ వ‌స్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.