క్వారంటైన్ లో టాలీవుడ్ హీరోయిన్

మొన్నటివరకు ఇండోనేషియా, మలేషియాలో చక్కగా ఎంజాయ్ చేసింది ప్రగ్యా జైశ్వాల్. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టింది. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇక తన హాలిడే ట్రిప్ చాలించి ఇండియాకొచ్చిందో అప్పుడు ప్రగ్యాకు కష్టాలు మొదలయ్యాయి.

కరోనా కారణంగా విదేశాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కర్ని నిశితంగా పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రగ్యా జైశ్వాల్ ను కూడా అధికారులు పరీక్షించారు. కాస్త టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టు తేలడంతో.. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ప్రస్తుతం తన ఇంట్లోనే, అందరికీ దూరంగా ఉంటోంది ప్రగ్యా. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. క్వారంటైన్ లో భాగంగా మొదటి రోజు ప్రారంభమైందని, ఇంకా 13 రోజులు ఒంటరిగా గడపాలంటూ బాధగా పోస్ట్ పెట్టింది. తనకు బోర్ కొడుతోందని, త్వరగా వెనక్కి తీసుకెళ్లిపోవాలని కోరుతోంది.

ఇప్పటికిప్పుడు ప్రగ్యా బయటకొచ్చి చేసేదేం లేదు. ఎందుకంటే ఆమె చేతిలో ప్రస్తుతం సినిమాల్లేవు. కనీసం ఓపెనింగ్స్, యాడ్స్ కూడా లేవు. కాబట్టి మిగిలిన ఈ 13 రోజులు ఆమె ఇంట్లో రెస్ట్ తీసుకుంటే.. ఆమెతో పాటు అందరికీ చాలా మంచిది. ఆ తర్వాత తీరిగ్గా సినిమా అవకాశాలు వెదుక్కోవచ్చు.