ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత..!

కరోనా ప్రభావంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్టే విధించమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఈసీ ఎన్నికల కోడ్ ఎత్తేసింది.

కాగా, ఎన్నికల కోడ్ ఎత్తివేత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి రానుంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకి లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇళ్ల పట్టాల పంపిణీ చేయరాదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లకు మెమోలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికల వాయిదా కలిసిరానుంది.

ఎన్నికల్లో ఓటమి పాలవుతామని గ్రహించిన ప్రతిపక్షనేత చంద్రబాబు తన వర్గం వ్యక్తి అయిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చేత ఎన్నికలు వాయిదా వేయించారనే ఆరోపణలు వచ్చాయి. కరోనా ప్రభావంతో ఎన్నికల వాయిదా వేశామని చెప్పిన కమిషనర్… అదే సమయంలో కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. ఇవన్నీ ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగానే చేస్తున్నారన్న చర్చ కూడా జరిగింది. కాని చివరకు ఎన్నికల వాయిదా అధికార వైసీపీకే కలిసి రావడం గమనార్హం.