జయదేవ్ ఉనద్కత్ కు మరో అవకాశమివ్వాలి

  • దేశవాళీ క్రికెట్లో టాపర్ జయదేవ్ ఉనద్కత్

సౌరాష్ట్ర్ర ను రంజీ చాంపియన్ గా నిలిపిన ..కెప్టెన్ కమ్ లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు భారత టెస్టుజట్టులో మరోసారి చోటు కల్పించాలని భారత మాజీ ఫాస్ట్ బౌలర్, క్రికెట్ కోచ్ కర్సన్ ఘావ్రీ సెలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

2010 సీజన్లో టెస్ట్ అరంగేట్రం చేసి…తగిన అవకాశాలు లేక.. కేవలం ఒకే ఒక్క టెస్టుకు పరిమితమైన ఉనద్కత్ లో ఇప్పుడు ఎంతో పరిణతి వచ్చిందని, 2019-2020 రంజీ సీజన్లో సౌరాష్ట్ర్రను కేవలం తన బౌలింగ్ ప్రతిభతోనే చాంపియన్ గా నిలిపిన ఘనతను ఉనద్కత్ సొంతం చేసుకొన్న విషయాన్ని గమనించాలని ఘావ్రీ సూచించారు.

రంజీసీజన్లో ఆడిన 10 మ్యాచ్ ల్లో 67 వికెట్లు పడగొట్టడం ద్వారా ఉనద్కత్ తన సత్తా చాటుకొన్నాడని, సెలెక్టర్లు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఘావ్రీ కోరాడు. ఐదుమ్యాచ్ ల్లో ఐదేసి వికెట్లు చొప్పున ఉనద్కత్ సాధించాడు.

జహీర్ ఖాన్ కు వారసుడు ఉనద్కత్….

భారతజట్టు ప్రస్తుత నాణ్యమైన లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ల కొరతతో అల్లాడుతోందని, అశీష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ ల తర్వాత టెస్టు క్రికెట్లో మరో లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ భారత్ కు దొరకలేదని…అయితే ..ఆ లోటును జయదేవ్ ఉనద్కత్ పూడ్చగలడని ఘావ్రీ భరోసా ఇచ్చారు.

దశాబ్దకాలం క్రితం 19 సంవత్సరాల వయసులో సౌతాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా టెస్ట్ అరంగేట్రం చేసిన జయదేవ్ ఉనద్కత్ 26 ఓవర్లలో 101 పరుగులిచ్చి.. ఒక వికెట్టూ పడగొట్టలేకపోయాడు.

తన కెరియర్ లో భారతజట్టులో సభ్యుడిగా 7 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. అంతేకాదు..ఐపీఎల్ సీజన్ వేలంలో అత్యధికంగా 11 కోట్ల 50 లక్షల రూపాయల రికార్డు ధర దక్కించుకొన్న మొనగాడిగా కూడా జయదేవ్ ఉనద్కత్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.

భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీ..ఓసారి ఉనద్కత్ గురించి ఆలోచించాలని, తిరిగి భారత టెస్టు జట్టులో చోటు కల్పించాలని కర్సన్ ఘావ్రీ గట్టిగా కోరాడు.