టాలీవుడ్ ప్రముఖుల సెల్ఫ్-క్వారంటైన్

కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అందుకే ఎవరికి వారు ఇళ్లలో ఉండడం సురక్షితం అనేది అంతా చెప్పే మాట. ఇప్పుడిదే మాటను సెలబ్రిటీలు చెబుతున్నారు. కొంతమంది ఆచరించి చూపిస్తున్నారు కూడా. ఇందులో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఉంది.

రీసెంట్ గా హాలిడే ట్రిప్ పూర్తిచేసుకొని విదేశాల నుంచి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్, తనకుతాను స్వీయ నిర్బంధం విధించుకుంది. 2 వారాల పాటు ఎవర్ని కలవకుండా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఇలా చేయడం వల్ల ఒకవేళ తనకు వైరస్ ఉన్నప్పటికీ వేరొకరికి అది వ్యాప్తి చెందడు.

సరిగ్గా ఇదే పద్ధతిని కమెడియన్ ప్రియదర్శి కూడా పాటిస్తున్నాడు. ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు జార్జియా వెళ్లిన ఈ హాస్యనటుడు.. అట్నుంచి ఇటు ఇండియా వచ్చిన వెంటనే ఇంటికెళ్లి తలుపులు మూసుకున్నాడు. 14 రోజుల పాటు తనకుతానుగా గృహనిర్బంధంలో ఉంటానని ప్రకటించుకున్నాడు.

అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కూడా స్వీయ నిర్బంధం విధించుకున్నాడు. 2 వారాల పాటు ఇంటికే పరిమితం అవ్వబోతున్నాడు. బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ ను కూడా క్వారంటైన్ లో పెట్టినట్టు ఆయన భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. ఓవైపు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే.. ప్రజలంతా ఇలా చేస్తే కరోనా వ్యాప్తిని అరికట్టడం చాలా సులభం.