“సునిశిత”మైన అంశంపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

హీరోయిన్లుగా మారిన తర్వాత పుకార్లు సహజం. ఫలానా సినిమా ఆఫర్ ఎగరేసుకుపోయిందంట అనే పుకారుతో పాటు.. ఫలానా వ్యక్తితో డేటింగ్ అంటగా అనే రూమర్ వరకు ఎన్నో పుకార్లు వినిపిస్తుంటాయి. చాలా పుకార్లను చాలామంది హీరోయిన్లు లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని రూమర్లు మాత్రం శృతిమించిపోతాయి. అలాంటప్పుడు మాత్రం హీరోయిన్లు బయటకు రాక తప్పదు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా అదే చేసింది.

ఈమధ్య సునిశిత్ అనే వ్యక్తి లావణ్య త్రిపాఠిపై అవాకులు చవాకులు పేలుతున్నాడు. తామిద్దరం డేటింగ్ చేశామని, కొన్నాళ్ల కిందట పెళ్లి కూడా చేసుకున్నామంటూ యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశాడు. ఇతడు కూడా ఓ చిన్న సైజ్ హీరోగా… రెండు మూడు సినిమాల్లో నటించాడట. ఈ మేటర్ అలా అలా లావణ్య త్రిపాఠి వరకు చేరింది. దీంతో ఆమె దీనిపై సీరియస్ గా స్పందించింది.

సునిశిత్ పై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య త్రిపాఠి. స్వయంగా తనే కంప్లయింట్ రాసి, తన అసిస్టెంట్ ద్వారా పోలీసులకు పంపించింది. దీంతో పోలీసులు మేటర్ ను సీరియస్ గా తీసుకున్నారు. విచారణ కూడా స్టార్ట్ చేశారు. సునిశిత్ మాట్లాడిన యూట్యూబ్ క్లిప్స్ ను బయటకు తీసే పనిలో పడ్డారు. ఇది గమనించిన సునిశిత్, తనకు తెలిసిన వాళ్లతో మాట్లాడి కొన్ని యూట్యూబ్ క్లిప్స్ ను డిలీట్ చేయించాడు.

అయినప్పటికీ మరికొన్ని పోలీసుల చేతికి చిక్కాయి. పైగా లావణ్య త్రిపాఠి వద్ద కూడా మరికొన్ని క్లిప్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి త్వరలోనే అతడ్ని కటకటాల వెనక్కి తోయబోతున్నారు పోలీసులు. అన్నట్టు ఇదే వ్యక్తి, తమన్నపై కూడా వాగాడు. తమన్నను తను పెళ్లి చేసుకున్నానని, కొన్నాళ్ల తర్వాత నచ్చక వదిలేశానని వాగాడు. పనిలోపని లావణ్య తో పాటు తమన్న కూడా ఫిర్యాదు చేస్తే ఓ పనైపోతుంది.