కరీంనగర్‌లో ఏడుగురికి కరోనా పాజిటీవ్..!

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా @ కోవిడ్ 19 వైరస్ ప్రపంచ దేశాలకు శర వేగంగా పాకుతోంది. వైరస్ ప్రస్తుతం తెలంగాణలో కూడా కనిపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఏడుగురికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.

ఆ ఏడుగురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో కరీంనగర్‌లో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఇప్పటికే నగరంలోని దుకాణాలు, హోటళ్లను మూసేయించారు.

కరీంనగర్‌కు నమాజ్ నేర్చుకోవడానికి వచ్చిన ఇండోనేషియా వాసులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. వారిని కలిసిన వ్యక్తులు ఎవరు అనే విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. అలా కలిసిన వ్యక్తులు తమంతట తాముగా స్వచ్చందంగా వైద్యులను సంప్రదించాలని మంత్రి కోరుతున్నారు. కరీంనగర్ ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.