భారత మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్ర

  • ఐసీసీ మహిళా అంపైర్లుగా భారత జోడీ
  • వృంధా రాఠీ, జననీలకు ఐసీసీ అర్హత

క్రికెట్లో అంపైరింగ్ బాధ్యతలు కేవలం పురుషులు మాత్రమే కాదు…మహిళలు సైతం సమర్థవంతంగా నిర్వర్తించగలరని భారత జోడీ వృంధా రాఠీ, జననీ నారాయణన్ చాటుకొన్నారు.

క్రికెట్ అంపైర్ల కోసం బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే కాదు… జాతీయస్థాయిలో సబ్ -జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో అంపైర్లుగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా ఐసీసీ అంపైర్ల ప్యానెల్ లో తొలిసారిగా చోటు సంపాదించారు. ఐసీసీ మహిళా అంపైర్లుగా ఎదిగిన భారత తొలి మహిళా అంపైర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

ముంబై వండర్ వృంధా రాఠీ….

2010 సీజన్ నుంచి ముంబై క్రికెట్ సంఘానికి స్కోరర్ గా సేవలు అందిస్తున్న 29 ఏళ్ల వృంధా రాఠీ…క్రమంగా అంపైరింగ్ బాధ్యతల పట్లు మొగ్గు చూపింది. నీడపట్టున ఉండి స్కోరర్ గా పని చేయటం కన్నా..ఆరుబయట, ఉక్కబోత, ఎండవేడిమి వాతావరణంలో సాగే అంపైరింగే తనకు మక్కువని నిర్ణయించుకొని…. బీసీసీఐ నిర్వహించిన క్రికెట్ అంపైరింగ్ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణురాలయ్యింది.

దీంతో ..ముంబై క్రికెట్ సంఘం నిర్వహించే స్ధానిక లీగ్ మ్యాచ్ లతో పాటు.. బాలుర సబ్-జూనియర్, జూనియర్, జాతీయ క్రికెట్ జూనియర్ మ్యాచ్ ల్లో అంపైర్ గా విధులు నిర్వర్తించి తన ప్రతిభను, అంకితభావాన్ని నిరూపించుకొంది.

ఐసీసీ నిర్వహించిన అంపైర్ పరీక్షల్లో సైతం ఉత్తీర్ణత సాధించి…ఏకంగా ఐసీసీ అంపైర్ల ప్యానెల్ లోనే చోటు సంపాదించింది. 2013 మహిళా ప్రపంచకప్ క్రికెట్లో అంపైర్ గా వ్యవహరించిన న్యూజిలాండ్ కు చెందిన కాథీ క్రాస్ తనకు ఆదర్శమని వృంధా ప్రకటించింది. భారత అంపైర్లు వృంధా, జననీ నారాయణన్ లను అంతర్జాతీయ అంపైరింగ్ ప్యానెల్ లో చేర్చినట్లు ఐసీసీ ప్రకటించడంతో…మహిళా అంపైర్ల సంఖ్య 12కు చేరుకొంది.

తమిళనాడు అంపైర్ జనని….

తమిళనాడు నుంచి అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ గా ఎదిగిన తొలిమహిళగా 34 సంవత్సరాల జననీ నారాయణన్ గుర్తింపు తెచ్చుకొంది.2018 నుంచి దేశవాళీ క్రికెట్లో అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్న జననీకి ఇంగ్లండ్ విఖ్యాత అంపైర్ డేవిడ్ షెఫర్డ్, భారత అంపైర్ శ్రీనివాస వెంకటరాఘవన్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇద్దరి స్ఫూర్తితోనే తాను అంపైర్ గా మారాలని నిర్ణయించుకొన్నట్లు ప్రకటించింది.

12కు చేరిన మహిళా క్రికెట్ అంపైర్లు

ఐసీసీ నియమించిన మహిళా క్రికెట్ అధికారులలో భారత్ కు చెందిన జీఎస్ లక్ష్మి, మరో మహిళ షాండర్ ఫ్రిట్జ్ అంతర్జాతీయ ప్యానెల్ మ్యాచ్ రిఫరీలుగా సేవలు అందిస్తున్నారు.

ఐసీసీ ప్యానెల్ అంపైర్లలో ఇప్పటికే చోటు సంపాదించిన వివిధ దేశాలకు చెందిన మహిళల్లో లారెన్ అగెన్ బాగ్, కిమ్ కాటన్, శివానీ మిశ్రా, క్లెయిరీ పోలోసాక్, సుజీ రెడ్ ఫెర్న్, ఎల్యోసీ షెర్యడాన్, మేరీ వాల్ డ్రోన్, జాక్వెలిన్ విలియమ్స్ ఉన్నారు. ఇప్పుడు జననీ నారాయణన్, వృంథా రాఠీ ఈ బందంలో వచ్చి చేరారు.

మహిళా క్రికెట్ కు కొత్త ఊపిరి..

మహిళా క్రికెట్ ను పురుషుల క్రికెట్ తో సమానంగా అభివృద్ధి చేయటానికి ఐసీసీ కంకణం కట్టుకొంది. 2020 టీ-20 మహిళా ప్రపంచకప్ ప్రచారంలో భాగంగా.. 100 రోజుల…నూటికి నూరుశాతం కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. అందులో భాగంగానే మహిళలకు క్రికెట్లో ఎక్కువ అవకాశాలు, ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది.

ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2020 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ ను…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించారు. ఈ మ్యాచ్ కు రికార్డుస్థాయిలో 86 వేల 174 మంది హాజరయ్యారు.

2021లో న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళా వన్డే ప్రపంచకప్ ప్రారంభం నాటికి…. మహిళా క్రికెట్ ను మరింత ఉత్కంఠభరితంగా మార్చడానికి ఐసీసీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.