ప్రపంచ యుద్దాల కంటే కరోనా పెద్ద విపత్తు..!

  • 22న జనతా కర్ఫ్యూ పాటిద్దాం
  • ప్రకటించిన ప్రధాని మోడీ

చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇండియాలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు ఈ నెల 22 (ఆదివారం) న స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది మన కోసం మనమే విధించుకునే కర్ఫ్యూ అని ప్రధాని అభివర్ణించారు.

ప్రస్తుతం మానవాళి మొత్తం కరోనా మహమ్మారి భారిన పడిందని. గత రెండు నెలలుగా దీనితో పోరాడుతున్నామని ప్రధాని అన్నారు. ఈ మహమ్మారి ప్రపంచ యుద్దాలకంటే పెద్ద విపత్తని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఇలాంటి సంక్లిష్ట స్థితిలో అందరం జాగ్రత్తగా ఉండి పోరాడాలని ప్రధాని సూచించారు. కరోనా నుంచి కాపాడేందుకు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా ఎలాంటి మార్గాన్ని కనిపెట్టలేకపోయారని.. కాని ఈ విలయం నుంచి మనలను మనమే కాపాడుకోవాలని ఆయన సూచించారు. మన దేశంలో కరోనా నుంచి ఊరట లభించడానికి మరి కొంత సమయం పడుతుందని.. అప్పటి వరకు నాకు సమయం ఇవ్వాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.

కరోనాను ఎదుర్కోవడం ఒకరితో అయ్యే పని కాదు. ప్రజలందరూ బాధ్యతలను గుర్తెరిగి మసలు కోవాలని ప్రధాని అన్నారు. వైరస్ కట్టడికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వీలైనంత వరకు ప్రజలు తమ వ్యాపారాలు, ఉద్యోగాలు ఇంటి నుంచే చేసుకోవాలని ప్రధాని సూచించారు.

వైద్యరంగం, మీడియాలో పని చేసే వాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాలి కనుక వాళ్లు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. 60 ఏండ్లు దాటిన వృద్దులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లినివ్వొద్దన్నారు.

ఈ ఆదివారం అది.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని.. కరోనా నివారణ కోసం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు స్థానిక సంస్థలు 5 గంటలకు సైరన్ మోగిస్తాయని.. ఆ సమయంలో ఇంట్లోని బాల్కనీలు, కిటికీలు, గుమ్మాల వద్ద నిల్చొని చప్పట్లు కొట్టి కరోనాతో పోరాడుతున్న వారికి సంఘీభావం తెలియజేయాలని ఆయన కోరారు. ఈ మహమ్మారి తగ్గే వరకు అత్యవసర సర్జరీలు మినహా సాధారణ వైద్య సేవలను వాయిదా వేసుకొని పారా మెడికల్, వైద్యులకు ఒత్తిడి లేకుండా చూద్దామని ఆయన అన్నారు.