పోలవరం నిర్మాణం ఇప్పుడు గాడిన పడింది

పోలవరం పరుగులు పెడుతోంది. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ గోదావరి వరద ప్రవాహాన్ని తలపించే విధంగా ప్రాజెక్ట్ వేగం అందుకుంది. సకాలంలో పనులు పూర్తిచేసేందుకు ఆగమేఘాల మీద ఉరకలువేస్తోంది.

రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయ (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరం ముందుకు సాగుతోంది.

అనువైన సమయం- పనులు ముమ్మరం

పనులు వేగవంతం చేసేందుకు ఇది అనువైన సమయం కావడంతో దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మేఘా) పూర్తిస్థాయిలో తన శక్తియుక్తులను ఈ ప్రాజెక్ట్ పై కేంద్రీకరించింది. నిర్ణీత గడువుకన్నా ముందే ప్రాజెక్ట్ ను పూర్తి చేయడంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మేఘా… పోలవరంలో తన సత్తా చాటేందుకు నడుం బిగించగా అందుకు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తోంది.

అనతికాలంలోనే ప్రాజెక్ట్ లోని స్పిల్ వేకు సంబంధించి 62818 ఘనపు మీటర్ల పనిని చేయడంతో పాటు మిగిలిన పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టేందుకు ప్రాథమిక కసరత్తులను మేఘా వేగవంతం చేసింది. ప్రాజెక్ట్ లో ప్రధానమైన పనులు వేగవంతం చేసేందుకు గోదావరి నడిఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ పరీక్షలు, గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరం అయ్యాయి.

కీలకమైన అనుమతులకు ప్రత్యేక అధికారులు

ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష్యం మేరకు పనులు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో డిజైన్లకు సంబంధించిన అనుమతులు సాధించడం చాలా కీలకమైనది. ఇప్పుడు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్లకు అనమతులు లభించకపోతే పనులు వేగంగా చేసినా ప్రయోజనం ఉండదు.

మళ్లీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మొదటికి వస్తుంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ ను పరిశీలించి సమీక్షించినప్పుడు అనుమతులు త్వరగా మంజూరు చేస్తే నిర్దేశించిన గడువు ప్రకారం పనులను పూర్తిచేస్తామని మేఘా యాజమాన్యం స్పష్టం చేసింది.

దాంతో డిజైన్ల అనుమతులు సాధించేందుకు ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి పనులు శాస్త్రీయ పద్ధతిలో ఊపందుకున్నాయి.

నిజానికి ప్రాజెక్ట్ నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విధానాలు (ఇంజనీరింగ్) స్పష్టంగా ఉన్నాయి. గత ప్రభుత్వం వాటిని ఏమాత్రం పాటించలేదు. పైగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా సంక్లిష్టం చేసి కొద్దిపాటి వరదలకే ప్రాజెక్ట్ లోకి నీరు చేరడమే కాకుండా గ్రామాలు మునిగిపోయే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ సమస్యను చక్కదిద్దే విధంగా పనులు వేగిరం అయ్యాయి.

గత ప్రభుత్వ తప్పిదాలు

ప్రాజెక్ట్ పనులను మేఘా సంస్థ నవంబర్ లో దక్కించుకున్నప్పటికీ వెంటనే పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. దాదాపు మూడు నెలల పాటు విలువైన సమయం వృధా అయ్యింది. అందుకు గత ప్రభుత్వం నాన్ ఇంజనీరింగ్ పద్ధతిలో పనులు చేపట్టడమే కారణం. ముంపు సమస్య తలెత్తి విలువైన సమయం వృధా కావడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్ట్ లో కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడమే కారణం.

అప్పట్లో ఆయన కాఫర్ డ్యామ్ ను పూర్తి చేసి ఎంతో కొంత నీటిని నిలబెట్టి దాని నుంచి కుడి, ఎడమ కాలువలకు వరద సమయంలో నీటిని విడుదల చేయడం ద్వారా ప్రాజెక్ట్ పాక్షికంగా పూర్తి చేశామని అనిపించుకునేందుకు ప్రయత్నించారు. నిజానికి ఇది ఇంజనీరింగ్ విధానాలకు వ్యతిరేకం. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఆయన ఒత్తిడికి తలొగ్గి 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించేందుకు అంగీకరించడం మరింత నష్టం చేకూర్చింది. ఇంతవరకు ఏ జలాశయ నిర్మాణాల్లోనూ లేనివిధంగా పోలవరంలో మాత్రమే ఈ విధమైన అనుమతి లభించింది. కాఫర్ డ్యామ్ అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణం జరిగేప్పుడు నీరు అడ్డురాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం.

దీనివల్ల గత ఏడాది వరదలప్పుడు జలాశయంలో నీరు నిలిచిపోయి పనులు ఆగిపోవడమే కాకుండా నిర్మాణం ప్రాంతంలో నిర్మించిన రహదారులు కొట్టుకుపోయాయి. కనీసం 4 టిఎంసీల నీరు నిలువ ఉండడంతో దానిని తోడితే తప్ప పనులు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో దాదాపు 3 నెలల పాటు పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఆ నీటిని తరలించాల్సి వచ్చింది.

అందువల్లనే జనవరి నెలాఖరుకు కానీ పనులు ఊపందుకుకోవడం సాధ్యం కాలేదు. ప్రాజెక్ట్ లో అన్ని పనులకు ఇంజనీరింగ్ పద్ధతిలో సమ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం స్పిల్వేతో పాటు కాఫర్ డ్యామ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. వాటిని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయింది.

ఈ ప్రాజెక్ట్ లో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన ఆనకట్ట)తో పాటు అందులోని మూడు గ్యాప్లు, స్పిల్వే, స్పిల్ చానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్ చానెల్, కుడి-ఎడమ కాలువల అనుససంధానంతో పాటు జల విద్యుత్ కేంద్రం కీలకమైనవి. వీటిల్లో చాలా పనులు అసలు గత ప్రభుత్వం చేపట్టనే లేదు. జల విద్యుత్ కేంద్రంలో గంప మట్టికూడా తీయలేదంటే ఎంత నిర్లక్ష్యం చేసిందో అర్థమవుతోంది.

జనవరి నుంచి స్పిల్వే పనులు ముమ్మరం చేసిన మేఘా ఇంజనీరింగ్ లక్ష్యానికి అనుగుణంగా వరదతో పోటీ పడిందా అన్నట్లు పనులు సాగిస్తోంది. జనవరిలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 21358 ఘ.మీ పనిని పూర్తిచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే బీమ్ ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్ లు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్వాల్ పనులను ఉధృతం చేసింది. అదే సమయంలో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి.

నిజానికి చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్ నత్తనడక నడిచింది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ కు కీలకమైన అనుమతులన్నీ అప్పుడే సాధించారాయన. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపలేదు. వైయస్ పాలనలోనే దాదాపు కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో 2010 నుంచి 2019 వరకు కేవలం స్పిల్ వే లో కొంత పనితోపాటు డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ మాత్రమే నిర్మించారు. ఇంతకు మించి అప్పుడు జరిగిందేమీ లేదు.

కీలకమైన డిజైన్లు

ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ సంస్థను మార్చి పనులు వేగవంతం చేయించడంతో పాటు అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులలో అనుమతులు చాలా కీలకమైనవి. గత ప్రభుత్వ వీటిని నిర్లక్ష్యం చేసింది. మొత్తం ప్రాజెక్ట్ లో 45 డిజైన్ లకు అనుమతి లభించాల్సి ఉండగా వాటిలో 37 డిజైన్ లు అనుమతి సాధించడానికి దాదాపు 10 ఏళ్ళ సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ లకు అనుమతి లభించలేదు. ఇవి ప్రాజెక్ట్ లో ముఖ్యమైనవి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ పనిని సమీక్షించి ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర జల సంఘం ఆధీనంలోని ప్రాజెక్ట్ అథారిటీ కమిటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మార్చి 8న హైదరాబాద్ లో ప్రాజెక్ట్ డిజైన్ ల కమిటీ సమావేశమై విస్తృతంగా చర్చించడం ద్వారా పెండింగ్ లో ఉన్న 8 డిజైన్ లకు సంబంధించి దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది.

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిపాదనలను డ్యామ్ డిజైన్ ల సమీక్ష బృందం పరిశీలించి కొన్నింటిని తిరస్కరించింది. ముఖ్యంగా ఆనకట్ట (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్) మూడో గ్యాపులో మట్టికట్ట నిర్మించాలనే ప్రతిపాదనను నిర్ద్వంధంగా తోసిపుచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా కాంక్రిట్ నిర్మాణం చేపడితేనే ప్రాజెక్ట్ వరదల సమయంలో పటిష్టంగా ఉంటుందని తేల్చిచెప్పింది.

ఇంజనీరింగ్ నిపుణులకు ఈ విధమైన స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు అతీతంగా ప్రభుత్వం పనులు చేయిస్తోంది. ప్రాజెక్ట్ డిజైన్ల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని సీడబ్ల్యూసి చైర్మన్ ఏ.డి.పాండ్య అధ్యక్షతన ఏర్పాటైన కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. దాంతో పెండింగ్ లో ఉండిపోయిన అప్రోచ్ ఛానెల్ ఎడమగట్టుపై ర్యాక్ ఫిల్ గైట్వాల్ నిర్మించడం, స్పిల్వే నుంచి విడుదలయ్యే వరద ఉధృతిని తట్టుకునే విధంగా ఎడమ గట్టువైపు పటిష్టమైన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ రూపొందించాలని నిర్ణయించింది.

అదే విధంగా స్పిల్వే నుంచి విడుదలయ్యే వరద నీరు కుడిగట్టుపై పడుతుంది. దీనికి కూడా పటిష్టమైన డిజైన్ ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. స్పిల్ ఛానెల్ నుంచి వరద నీరు పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరి నదిలోకి కలిసే పనులకు సంబంధించి డిజైన్ ను కేంద్ర జలసంఘానికి ప్రాజెక్ట్ అధికారులు సమర్పించారు. దీనికి త్వరితగతిన అనుమతి సాధించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్ లో ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం దీని అనుమతులు సాధించేందుకు శ్రద్ధ చూపించలేదు.

గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విధంగా అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. మొత్తానికి ఇక పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలుగుతోంది.