ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

కరోనాపై పోరాటానికి ప్రధాని మోడీ ఈ నెల 22 (ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఇవాళ అర్థరాత్రి నుంచే రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రైవేటు బస్ ఆపరేటర్లు కూడా సహకరించాలని ఆయన కోరారు.

మరోవైపు కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ఫోర్స్‌లో కలెక్టర్, ఎస్పీతో సహా 18 మంది సభ్యులు ఉంటారు.

కాగా, కరోనా నేపథ్యంలో సచివాలయంలో కూడా ఆంక్షలు విధించారు. ఈ నెల 23 నుంచి సెక్రటేరియట్‌కు ఉద్యోగులను తప్ప ఎవరినీ అనుమతించమని మంత్రి చెప్పారు.