కరోనా నిర్థారణ ల్యాబ్‌గా సీసీఎంబీ..?

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)ని కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌గా ఉపయోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడం వల్ల కేవలం తెలంగాణ వాళ్లకే కాక దేశవ్యాప్తంగా ఎక్కడి వారికైనా కరోనా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని ఆయన ప్రధాని దృష్టికి తెచ్చారు. సీసీఎంబీలో ఒకే సారి వెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించే వీలుంటుందని కేసీఆర్ అన్నారు.

కరోనా వ్యాప్తి, నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన సీసీఎంబీ విషయాన్ని ప్రస్తావించారు. అంతే కాకుండా అది కేంద్ర పరిధిలోని సంస్థ కాబట్టి ప్రధాని ఆదేశాలతో ల్యాబ్ ఏర్పాటు త్వరితగతిన పూర్తవుతుందని సూచించారు.

ఇక దేశంలోని పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తున్నారని.. వీరిని క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. ఎక్కువ జనసమ్మర్థం ఉండే నగరాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ సూచించారు.

ఇప్పటికే తెలంగాణలో జనం గుమికూడకుండా తగిన చర్యలు తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. శ్రీరామనవమి, జగ్నేకీ రాత్ లాంటి పండుగల సందర్భంగా నిర్వహించే ఉత్సవాలను రద్దు చేశామని.. కరోనా వైరస్ సంబంధిత కార్యక్రమాల్లో కేంద్రంతో కలసి పని చేస్తామని సీఎం కేసీఆర్ ప్రధానికి హామీ ఇచ్చారు.