మెట్రో పూర్తిగా…. ఎంఎంటీఎస్ పాక్షికంగా బంద్

కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రేపు మెట్రో రైలు సేవలను పూర్తిగా నిలివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అవగాహన కల్పిస్తున్న మెట్రో.. రేపు పూర్తిగా రైళ్లు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకే అయినా.. మెట్రో రైళ్లు మాత్రం రోజంతా నడువవు. అలాగే అన్ని రైల్వే స్టేషన్లను మూసివేస్తామని మెట్రో ప్రకటించింది. ఢిల్లీ, ముంబై మెట్రోలు సైతం నిలిపివేస్తున్నట్లు నిన్ననే ప్రకటించారు.

మరోవైపు హైదరాబాద్‌లో మాత్రం ఎంఎంటీఎస్ సేవలు పాక్షికంగానే బంద్ కానున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 12 ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేలో 250కి పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశామని చెప్పారు. రేపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య బయలుదేరే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశామని ఆయన తెలిపారు.

అంతే కాకుండా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్న రైల్వే స్టేషన్లలో వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులను మూసేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.