నిమ్మగడ్డ రమేశ్, చంద్రబాబైనా… ఆ లేఖతో తప్పించుకోలేరు

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసిన లేఖ ఏపీ సర్కారును కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ లేఖను తాను రాయలేదన్న రమేశ్ కుమార్ మాటను పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం దానిపై విచారణ జరిపేందుకు నడుం బిగించింది.

నిమ్మగడ్డ పేరుతో విడుదలైన లేఖను ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు తప్పవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేశ్ కుమార్ పేరుతో కేంద్రహోంశాఖకు పంపిన లేఖ టీడీపీ అధినేత చంద్రబాబు అయినా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అయినా తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

నిమ్మగడ్డ రమేశ్ తో చంద్రబాబు డ్రామాలు ఆడించి ఎన్నికలు వాయిదా వేయించాడని.. తన మనుగడ కోసం కులం, ప్రాంతం కార్డులను వాడుతున్నాడని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వీళ్ల ఆటలు కొద్దిరోజులు సాగినా చివరకు చట్టాల ముందు తల వంచాల్సిందేనని అన్నారు.