చత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్… 17 మంది జవాన్లు మృతి

చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మారణకాండ సృష్టించారు. శనివారం కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా సిబ్బంది కోసం గాలింపు చేపట్టగా 17 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరంతా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

శనివారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా టీం సభ్యులు సంయుక్తంగా సుక్మా జిల్లా చింతగుహ సమీపంలోని మన్నప్ప అటవీ ప్రాంతానికి కూంబింగ్‌కు వెళ్లారు. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతో దాదాపు 600 మంది భద్రతా సిబ్బంది కూంబింగ్‌కు వెళ్లారు.

తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలతో పాటు చత్తీస్‌గడ్ కేడర్ కూడా పెద్ద ఎత్తున సమావేశం అయినట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం కూంబింగ్‌కు వెళ్లిన సమయంలో మావోయిస్టులు దాడి చేయగా భద్రతా దళాలు సమర్ధవంతంగా తిప్పి కొట్టాయి.

ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత భద్రతా దళాలు తమ క్యాంప్‌కు వెళ్లడానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో చింతగుహ సమీపంలోని కోర్జాగూడ వద్ద అకస్మాత్తుగా భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. హఠాత్తుగా దాడి చేయడంతో భద్రతా దళాలు తిరిగి కాల్పులు చేయలేకపోయాయి. ఆ శబ్దాలకు దూరంగా ఉన్న దళాలు కూడా వారికి సహాయం కోసం వచ్చాయి. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో ఇవాళ ఉదయం అధికారులు డ్రోన్ల సహాయంతో గాలింపు చేపట్టగా 17 మంది మృతదేహాలు కనపడ్డాయి. సంఘటన స్థలం నుంచి ఏకే 47లు, గ్రైనేడ్ లాంఛర్లు మాయమయ్యాయి. మావోయిస్టులకు ఎవరో సమాచారం ఇవ్వడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి మృతదేహాలను తరలిస్తున్నారు. 2019లో బీజేపీ ఎమ్మెల్యే మండావిపై మావోయిస్టులు దాడి చేసి చంపేశారు. ఆ ఘటన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ఇదే పెద్ద ఎన్‌కౌంటర్ అని అధికారులు తెలిపారు.