తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ

  • అవసరమైతే షట్‌డౌన్ చేస్తాం
  • వైరస్ ఉధృతమైతే ఇంటికే రేషన్
  • విలేకరు సమావేశంలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కాగా, తెలంగాణలో కర్ఫ్యూ 24 గంటల పాటు పాటించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దామని కేసీఆర్ చెప్పారు.

కర్ఫ్యూ నేపథ్యంలో బస్సులు, మెట్రో సేవలను రద్దు చేస్తున్నామన్నారు. అంతర్రాష్ట్ర బస్సులను సైతం నిలిపేస్తున్నామని ఆయన అన్నారు.

కరీంనగర్‌లోని 10 మంది ఇండోనేషియన్లకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని.. వారిని ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ మొత్తం ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించామని. ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని కేసీఆర్ చెప్పారు.

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి తెలంగాణకు 20వేల మంది విదేశీయులు వచ్చారని.. నిన్న ఒక్క రోజే 1500 మంది వచ్చినట్లు సీఎం తెలిపారు. వీరిలో 11వేల మందిని ప్రభుత్వం ఆధీనంలోని తీసుకున్నామని అన్నారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌కు తరలించామన్నారు.

వేరే దేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెడుతున్నానని. దయ చేసి స్వీయ నియంత్రణ పాటించమని కోరారు. వెంటనే వచ్చి కరోనా పరీక్షలు చేసుకొని 14 రోజులు క్వారంటైన్‌లో ఉండమన్నారు. మీ ద్వారా ఇతరుల ప్రాణాలకు ముప్పు తేవొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇవాళ కూడా ఎవరో కరోనా లక్షణాలున్న వ్యక్తి రైలెక్కి వెళ్లిపోవాలని చూశారని. వారిని రైల్లోంచి దించి గాంధీ హాస్పిటల్ కి తరలించాల్సి వచ్చిందన్నారు. కరోనా ఉంటే ప్రభుత్వమే 100 శాతం ఖర్చు భరించి చికిత్స చేయిస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

24 గంటల కర్ఫ్యూకు తెలంగాణ ప్రజలందరూ సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రైళ్లు, బస్సులు అన్నీ 100 శాతం బంద్ చేస్తున్నాం. అత్యవసర సేవల కోసం ప్రతీ డిపోలో 5 బస్సులు, 5 రైళ్లు సిద్దం చేసినట్లు కేసీఆర్ చెప్పారు.

షాపులు, మాల్స్ అన్నీ బంద్ చేయాలని.. ఎమర్జెన్సీ సిబ్బంది మినహా అందరూ స్వీయ నిర్బంధంలోనికి వెళ్లిపోవాలని కేసీఆర్ చెప్పారు. ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోల్ బంకులు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు.

కరోనా వైరస్ ఉధృతి మరింతగా పెరిగితే ఇంటికే రేషన్ పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పేదవాని ఇంటికి ఉచితంగా రేషన్ పంపుతామని చెప్పారు. ఇందు కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా వెనకాడబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.

తాను బతికున్నంత వరకు ఏ పేదవాడికీ అన్యాయం జరగదని ఆయన భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రం 5 గంటలకు అందరూ చప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలియజేయాలని కేసీఆర్ చెప్పారు.