Telugu Global
Others

మోదీ-ట్రంప్ మితవాద జుగల్బందీ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుడిగాలి పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమైందని కేరింతలు కొడ్తున్నారు. ప్రధానమంత్రి మోదీ రాజ లాంఛనాలతో ట్రంప్ కు ఘనంగా స్వాగతం పలికారు. “నా పర్యటన అద్భుతం” అని ట్రంప్ ఈ స్వాగత సత్కారాలకు మురిసిపోయారు. ఇందులో దౌత్య నీతీ ఉంది. రాజకీయాలూ ఉన్నాయి. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సయోధ్య వ్యక్తం అయింది. దీని పర్యవసానం ఏమిటంటే ఇప్పుడు అమెరికా, భారత్ “సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు”. మూడు బిలియన్ డాలర్ల […]

మోదీ-ట్రంప్ మితవాద జుగల్బందీ
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుడిగాలి పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమైందని కేరింతలు కొడ్తున్నారు. ప్రధానమంత్రి మోదీ రాజ లాంఛనాలతో ట్రంప్ కు ఘనంగా స్వాగతం పలికారు. “నా పర్యటన అద్భుతం” అని ట్రంప్ ఈ స్వాగత సత్కారాలకు మురిసిపోయారు.

ఇందులో దౌత్య నీతీ ఉంది. రాజకీయాలూ ఉన్నాయి. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సయోధ్య వ్యక్తం అయింది. దీని పర్యవసానం ఏమిటంటే ఇప్పుడు అమెరికా, భారత్ “సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు”.

మూడు బిలియన్ డాలర్ల మేర రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని తిరిగి వెళ్లినందువల్ల ట్రంప్ కు ఆనందంగా ఉండవచ్చు. అమెరికా సైన్యంతో కలిసి పని చేస్తామని మోదీ హామీ ఇవ్వడం కూడా ట్రంప్ కు ఆనంద దాయకమే. అంటే భారత్ అమెరికా నుంచి మరింత సైనిక సామాగ్రి దిగుమతి చేసుకుంటుందన్న మాట. ఆ సామాగ్రి అమెరికా క్లౌడ్ సర్వర్లతో అనుసంధానమై ఉంటుంది.

భారత్ కు “బ్లూ డాట్ నెట్వర్క్”తో కూడా సంబంధాలు ఏర్పడతాయి. ఇందులో చేరడం అంటే భారత మౌలిక సదుపాయాలను, అభివృద్ధి పథకాలను అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ (డి.ఎఫ్.సి.) తో సర్టిఫై చేయించుకోవలసి ఉంటుంది.

అమెరికాలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సైనిక నెట్వర్క్ లతో సంబంధం ఉంటుందంటే ట్రంప్ సంతోషంగానే వెనుదిరిగారు. దీనితో భారత్ చైనా కు సరితూగేట్టు తయారవుతుందన్నది అమెరికా ఆనందం.

ట్రంప్ పర్యటన నుంచి మోదీ రెండు విషయాలు కోరుకున్నారు: ఒకటి, పశ్చిమ దేశాలలోని ఉదారవాదులు ట్రంప్ పర్యటనను ఈసడించడాన్ని పట్టించుకోక పోవడం. రెండవది 370వ అధికరణాన్ని రద్దు చేసినందుకు ట్రంప్ సమర్థించరేమోనని మోదీ భయపడ్డారు. రెండు అంశాలలోనూ ట్రంప్ సానుకూలంగానే ప్రవర్తించారు. కానీ మోదీ పాకిస్తాన్ తో నేరుగా తలపడడాన్ని మెచ్చలేదు.

నౌకా దళానికి కావలసిన ఎం.హెచ్-60ఆర్ హెలీకాప్టర్లు, ఎ.హెచ్-64ఇ హెలీకాప్టర్లు అమెరికానుంచి కొంటున్నందుకు; హక్కానీ నెట్వర్క్ ను, పాకిస్తాన్ లోని తెహ్రీక్-ఇ-తాలిబన్ ను తీవ్రవాద ముఠాల్లో చేర్చడానికి ట్రంప్ అంగీకరించినందుకు భారత్ లోని కులీన వర్గాలు సంతోషిస్తున్నాయి. మొత్తం మీద అమెరికా ప్రభుత్వం తమను లెక్క చేయకుండా ఉండనందుకు భారత ప్రభుత్వం సంతోషంగా ఉంది.

ఒక వేపు ట్రంప్ పర్యటన కొనసాగుతుండగానే ఈశాన్య దిల్లీలో దౌర్జన్యకాండ చెలరేగింది. సబర్మతి నది ఒడ్డున మోదీ, ట్రంప్ ఆలింగనాల్లో నిమగ్నమైన సమయంలోనే, గాంధీ శాంతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నప్పుడే యమునా నది ఒడ్డున మత రక్కసి విలయ తాండవం చేసింది. ఒక వేపు మృత్యు ఘంటికలు మోగుతుండగానే ట్రంప్, మోదీ ఒకరి వీపు ఒకరు చరుచుకున్నారు. ఈ దౌత్య విన్యాసం నిరాటంకంగా కొనసాగింది.

హత్యకాండను వీరు పట్టించుకోకపోవడం ఈ ఇద్దరు నాయకులు మితవాద సిద్ధాంతాలను ఆచారించడంవల్లే. ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం, వలసలను వ్యతిరేకించడం, ఇస్లాం అంటే సహించకపోవడం ఈ ఇద్దరు నాయకులకు మధ్య ఉన్న సామ్యమే. వారి అభిప్రాయాలకు ఉదారవాద విధానాలు సరిపడవన్నది ఇద్దరి అభిప్రాయం కూడా.

ఈ సంక్షోభం నుంచి ఇద్దరు నాయకులు తమకు కావలసిన ఫలితాలు ఎటూ పొందుతారు. కానీ ట్రంప్ పర్యటనకు ఒక నెల రోజుల ముందే అమెరికా గూఢచార విభాగం వారు దిల్లీలో మకాం వేసి ఉన్నా వారికి దిల్లీలో భద్రతా వ్యవస్థ ఛిన్నాభిన్నం అయి ఉండడం మాత్రం కనిపించకపోవడం మాత్రం ఆశ్చర్యం కల్గించక మానదు. దిల్లీలో ఉన్న మతోద్రిక్తతలను అంచనా వేయడంలో అమెరికా గూఢచార వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.

ఈ దౌత్య నీతి, సైద్ధాంతిక సామ్యం గత సెప్టెంబర్ నుంచే పొడసూపింది. అప్పుడు అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హర్ష వర్ధన్ ష్రింగ్ల (ఇప్పుడాయన విదేశాంగ కార్యదర్శి) తీవ్ర మితవాద వర్గానికి చెందిన అమెరికా నాయకుడు, వ్యూహకర్త స్టీవ్ బానన్ ను భారత రాయబార కార్యాలయంలో కలుసుకున్నారు. బానన్ తో తన సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని ష్రింగ్లా గర్వంగా ట్వీట్ చేశారు. బానన్ ను “గొప్ప సిద్ధాంత కర్త” అని, “ధర్మం” కోసం పోరాడేవాడు అని రాశారు. యాదృచ్చికమైన విషయం ఏమిటంటే ఎరోల్ మోరిస్ దర్శకత్వంలో బానన్ పై నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం పేరు “అమెరికన్ ధర్మ”. బానన్ జాత్యహంకారానికి ప్రతీక.

ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ విజయానికి మద్దతిచ్చింది ట్రంపే. మోదీ విజయావకాశాలు సన్నగిల్లితే ట్రంప్ ఆదుకుంటాడు. అమెరికా అధ్యక్ష స్థానానికి జరగనున్న ఎన్నికల్లో అమెరికాలో ఉన్న భారతీయుల మద్దతు కూడగట్టడానికి మోదీ చేయగలిగిందంతా చేశారు. వైపరీత్యం ఏమిటంటే కరడుగట్టిన జాతీయతావాదులు, ప్రపంచీకరణ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమైన వారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరడుగట్టిన మితవాద భావాలు వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నారు.

భారత్ లో పౌరసత్వ నియమాలను తిరగదోడే ప్రయత్నాల విషయంలో ట్రంప్ మౌనం వహించడం ఇజ్రాయిల్ లో “జాతి-రాజ్య” మౌలిక చట్టానికి మద్దతివ్వడానికి ఏ రకంగానూ భిన్నమైంది కాదు. మోదీ దక్షిణాసియాలో నెతన్యాహూ లాగా ఉపయోగపడతారన్న నమ్మకం ట్రంప్ కు కుదిరింది. పలస్తీనియన్లను జియానిస్టులు ఎలా కించపరుస్తున్నారో హిందుత్వ వాదులు ముస్లింలను అలాగే చిన్న చూపు చూడడం ట్రంప్ కు తృప్తి కలిగిస్తోంది.

నెతన్యాహూతో కలిసి ట్రంప్ “పశ్చిమాసియా శాంతి ఒప్పందాన్ని” బలవంతంగా రుద్దారు. కశ్మీర్ విషయంలో అలాంటి ఏకపక్ష నిర్ణయం అమలు కావాలని ట్రంప్ కోరుకుంటున్నారనడంలో ఆశ్చర్యం లేదు. ఈ విషయంలో ఆయన మోదీకి దన్నుగా ఉంటారు. దీనివల్ల ఈ ప్రాంతం మరింత అస్థిరం కాక తప్పదు.

అమెరికా అధ్యక్షుడు దిల్లీలో ఉండగానే దిల్లీలో మత రక్కసి విలయ తాండవాన్ని కనిపించకుండా చేయడంలో మోదీ కృతకృత్యులయ్యారు. ఉదారవాదులు అమెరికాకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని ఆయన మురిసి పోతున్నారు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  23 March 2020 9:35 PM GMT
Next Story