కరీంనగర్‌ను కరోనా ఇలా వణికిస్తోంది… రైతుబజార్‌లో చనిపోయిన వ్యక్తి..!

తెలంగాణలో ముఖ్య నగరమైన కరీంనగర్‌ను కరోనా విపరీతంగా భయపెడుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన కొంత మంది కరోనా పాజిటీవ్‌తోనే ఊరంతా తిరిగారని.. పలురికి వారి నుంచి కరోనా సోకిందనే వార్తలు వచ్చాయి.

పోలీసులు, వైద్యాధికారులు వారిని అదుపులోనికి తీసుకొని క్వారెంటైన్ సెంటర్లకు తరలించారు. ఈ వార్త బయటకు వచ్చాక కరీంనగర్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలెవరూ గడప దాటి బయటకు రావడం లేదు. అందరూ స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు.

ఇక రెడ్‌జోన్ (ఇండోనేషియన్లు తిరిగిన ప్రదేశాలు) కాలనీలు ఏకంగా కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగమే వారికి కూరగాయలు, నిత్యావసరాలు ఉచితంగా ఇంటింటికి చేరవేశారు. కరీంనగర్‌లో ఇంకా ఎవరికీ కరోనా లక్షణాలు లేవని చెప్పినా ప్రజలు మాత్రం భయపడుతూనే ఉన్నారు. ఇక బుధవారం చోటు చేసుకున్న ఒక ఘటన కరీంనగర్ వాసులు ఎంతలా భయపడుతున్నారో చెప్పకనే చెబుతోంది.

కరీంనగర్ కశ్మీర్ గడ్డ రైతుబజార్‌కు కూరగాయలు కొనడానికి వచ్చిన ఒక వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అయితే కరోనా భయంతో అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ అతని సమీపంలోనికి వెళ్లడానికి కూడా సాహసం చేయలేదు. చివరకు ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకొని ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.