పరిస్థితి చేయి దాటితే షూట్ ఎట్ సైట్ – సీఎం కేసీఆర్

కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, లాక్‌డౌన్ ప్రకటించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్ అమలు అవుతున్న తీరు, కరోనా తీవ్రతపై మంగళవారం ప్రగతి భవన్‌లో రెవెన్యూ, హోం, వైద్య ఆరోగ్యం, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 మంది కరోనా పాజిటివ్‌గా నమోదయ్యారని.. వీరిలో ఒకరు కోలుకొని డిశ్చార్జ్ కాగా, మరో 114 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం లాక్‌డౌన్ ప్రకటిస్తే అందరూ రోడ్ల మీదకు రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 24 గంటల కర్ఫ్యూ విధిస్తామని, అప్పటికీ మారకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తామని కేసీఆర్ హెచ్చరించారు.

ప్రజల అలసత్వం ఇలాగే కొనసాగితే ఆర్మీని దింపడానికి కూడా వెనకాడబోమని కేసీఆర్ అన్నారు. ప్రజలు అలాంటి పరిస్థితి తీసుకొని రావొద్దని, ప్రజలంతా కరోనా కట్టడికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గత రెండు రోజులుగా గమనిస్తున్నాను లాక్‌డౌన్ సమయంలో రోడ్లపై పోలీసులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. రేపటి నుంచి ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో 150 మంది కార్పొరేటర్లకు తోడు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా తమ తమ ప్రాంతాల ప్రజలకు సేవ చేయవలసిన సమయం వచ్చిందన్నారు. ఇలాంటి సమయంలోనే ప్రజలకు అండగా ఉండాలని ఆయన అన్నారు. మంత్రులందరూ జిల్లా కేంద్రాల్లో, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.

గ్రామాల్లో సర్పంచ్ ,వార్డు మెంబర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పీఏసీఎస్ సభ్యులు, చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ అన్నారు. ప్రజలు ఎవరూ ఇండ్లు వదలి బయటకు రావొద్దని ఆయన కోరారు. చావులు, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రులకు వెళ్లడం, ఇతర అత్యవసర పనులు ఉంటే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని.. ప్రభుత్వ అధికారులే మీకు సహాయం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని.. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని ఆయన అన్నారు. కిరాణ దుకాణాలు సాయంత్రం 6 గంటల లోపు మూసేయాలని.. 6 గంటల తర్వాత తెరిచి ఉంచితే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఇక కూరగాయలు, నిత్యావసర సరుకుల వ్యాపారులు ధరలు పెంచి అమ్మితే పీడీ యాక్టు కింద బుక్ చేయడమే కాక లైసెన్సు రద్దు చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అలాంటి వారిపై నిఘా కొనసాగుతుందని.. ఇక జీవితంలో ఎలాంటి వ్యాపారం చేయకుండా బ్లాక్ లిస్టులో పెడతామని కేసీఆర్ చెప్పారు.

గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకునే వారికి వెసులుబాటు కల్పిస్తున్నామని.. ఉపాధి హామీ పనులు, ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కానీ ఆయా పని ప్రదేశాల్లో సామాజిక దూరం పాటిస్తూ శుభ్రతకు పెద్ద పీఠ వేయాలన్నారు. ఇక సరిహద్దుల్లో అనేక వాహనాలు నిలిచిపోయాయి. ఇవ్వాల్టికి టోల్ ఎత్తేసి వాటిని అనుమతిస్తాం. ఇక రేపటి నుంచి వాళ్లు తిరగడానికి వీళ్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రజలందరూ ఈ లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించాలని, స్వీయనియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తుదముట్టిద్దామని పిలుపునిచ్చారు.