21 రోజుల లాక్ డౌన్ కు క్రికెటర్ల మద్దతు

  • స్వీయరక్షణతోనే కరోనా నియంత్రణ
  • కొహ్లీ, కైఫ్, రైనా, అశ్విన్ ప్రచారం….

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, మూడోదశను అడ్డుకోడానికి వీలుగా ప్రధాని నరేంద్ర మోడీ…దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ పిలుపునకు… భారత క్రికెట్ స్టార్లు, పలువురు బాలీవుడ్ దిగ్గజాలు సంపూర్ణ మద్దతు పలికారు.

ప్రధాని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొన్నారని, దేశంలోని 130కోట్ల జనాభాలో ప్రతిఒక్కరూ ప్రధాని పిలుపును అందుకోవాల్సిందేనని, మాటను మన్నించి తీరాల్సిందేనంటూ…ఎవరికివారే తమదైనశైలిలో మద్దతు తెలిపారు.

క్రీజుదాటితే డకౌటే- అశ్విన్…

ట్విట్టర్ ద్వారా చమత్కారాలు చేసే భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్…21 రోజుల లాక్ డౌన్ ను గట్టిగా సమర్థించాడు. దేశంలోని ప్రజల విలువైన ప్రాణాలను కాపాడుకోడం కోసం ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించారని గుర్తు చేశాడు.

క్రికెట్ ఆటలో ఓ ఆటగాడు క్రీజు బయటకు వస్తే ఏ విధంగా డకౌట్ కాగలడో… కరోనాతో పోరాటంలో…అదీ లాక్ డౌన్ సమయంలో ఇల్లుదాటి బయటకు వస్తే విలువైన ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

గత ఐపీఎల్ సీజన్లో క్రీజు వెలుపల ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిని తాను స్టంపౌట్ చేసిన చిత్రాన్ని పోస్ట్ చేశాడు.

విరుష్కా జోడీ సైతం….

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, అతని భార్య అనుష్క శర్మ సైతం లాక్ డౌన్ ను అందరూ తుచ తప్పక పాటించి తీరాలని, ఇంటిపట్టునే ఉండాలని, గుంపులుగుంపులుగా వీధుల్లో గుమికూడరాదని, ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం, రాష్ట్ర్రప్రభుత్వాలు చూసుకొంటాయని తమ సందేశంలో చెప్పారు.

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సైతం…మీ కుటుంబాన్ని కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలంటే…ఇంటిపట్టునే ఉండాలంటూ అభిమానులకు సవాలు విసిరాడు.

ఎవరికివారే స్వీయనియంత్రణ పాటించి…ఇంటికే పరిమితమైతే…కరోనా వైరస్ దరిదాపులకు రాదని తన సందేశంలో చెప్పాడు.

మరోమాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం…తనదైన శైలిలో …క్రికెట్ పరిభాషలోనే సందేశం ఇచ్చాడు. క్రికెట్లో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ బౌండ్రీలు, సిక్సర్లు కొడుతున్నసమయంలో ఫీల్డర్లంతా బౌండ్రీలైన్ దగ్గర మాత్రమే మొహరిస్తారని…అలానే కరోనా వైరస్ ను నిలువరించాలంటే.. అందరూ దూరం పాటించాలని, ఇంటిపట్టునే ఉండితీరాలని సూచించాడు.

ఇంటిపట్టునే ఉండి 21 రోజులపాటు సంయమనం పాటిస్తే..కరోనా ముప్పునుంచి తప్పించుకోవచ్చునని…అదే 21 రోజులపాటు సహనం పాటించకపోతే…విలువైన ప్రాణాలు కోల్పోడం ద్వారా 21 సంవత్సరాలపాటు విషాదాన్ని అనుభవించే ప్రమాదం ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ కామెంటీటర్ కెవిన్ పీటర్సన్ సైతం..స్వీయ క్వారెంటైయిన్ పాటించాలంటూ తన అభిమానులకు హిందీ భాషలో ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చాడు.

పఠాన్ బ్రదర్స్ మాస్క్ ల పంపిణీ…

బరోడా బాంబర్స్, పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్, యూసుఫ్ బ్రదర్స్…తమవంతుగా బరోడాలో జనానికి మాస్క్ లను పంచి పెట్టారు. కరోనా వైరస్ ను మాస్క్ లు ధరించడం ద్వారా నియంత్రించవచ్చునని, ఎవరికివారే స్వీయరక్షణ ఏర్పాటు చేసుకోవాలని పఠాన్ బ్రదర్స్ కోరారు. ప్రధానితో పాటు వైద్య అధికారులు ఇచ్చిన సలహాలు, సూచనలు
పాటిస్తే అందరమూ సురక్షితంగా ఉండవచ్చునని చెప్పారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, తాప్సీ, రిషకపూర్ తో సహా పలువురు బాలీవుడ్ స్టార్లు మూడువారాల లాక్ డౌన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.