Telugu Global
NEWS

ఎన్‌వోసీ పత్రాల గోల

సరిహద్దులో నిలిచిపోయిన వేలాది మంది కనికరించిన ఏపీ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లకు తరలింపు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, స్థానిక పోలీసులు తీసుకున్న ఒక నిర్ణయం గందరగోళం సృష్టించింది. కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలు నుంచి కర్మాగారాల వరకు అన్నింటినీ మూసేసారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్‌లోని హాస్టల్స్‌ను ఖాళీ చేయించారు. రవాణా సౌకర్యాలు లేకుండా మేం ఎటు పోవాలంటూ […]

ఎన్‌వోసీ పత్రాల గోల
X
  • సరిహద్దులో నిలిచిపోయిన వేలాది మంది
  • కనికరించిన ఏపీ ప్రభుత్వం
  • క్వారంటైన్ సెంటర్లకు తరలింపు

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, స్థానిక పోలీసులు తీసుకున్న ఒక నిర్ణయం గందరగోళం సృష్టించింది. కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలు నుంచి కర్మాగారాల వరకు అన్నింటినీ మూసేసారు.

దీంతో జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్‌లోని హాస్టల్స్‌ను ఖాళీ చేయించారు. రవాణా సౌకర్యాలు లేకుండా మేం ఎటు పోవాలంటూ విద్యార్థులు, ఉద్యోగులు పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారి సొంతూర్లకు వెల్లడానికి పై అధికారులను సంప్రదించకుండానే నిరభ్యంతర పత్రాలు(ఎన్ఓసీ) జారీ చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

హైదరాబాద్‌లో ఎన్‌వోసీలు పొందిన దాదాపు 8 వేల మంది ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ఊర్లకు బయలుదేరారు. కాగా వారిని ఏపీ అధికారులు సరిహద్దుల్లో నిలిపివేశారు. వాళ్లెవరినీ ఏపీలోకి అనుమతించేది లేదని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో సరిహద్దుల వద్ద వేల సంఖ్యలో చిక్కుకపోయారు.

కాగా, ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అంత మందికి నిరభ్యంతర పత్రాలు ఇచ్చి ఎలా రోడ్లపైకి వదులుతారంటూ ప్రశ్నించింది. అటు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ సీఎంవోలు సంప్రదింపులు జరుపుకున్నాయి.

ఎట్టకేలకు సరిహద్దుల వరకు చేరుకున్న వారిని గురువారం ఉదయం ఏపీలోనికి అనుమతించారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్దకు వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్ ఐటీకి, తూర్పు గోదావరి జిల్లా వారిని రాజమండ్రికి, పశ్చిమ గోదావరి జిల్లా వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఇక హైదరాబాద్ నుంచి ఎవరూ రావొద్దని.. వచ్చినా వారిని అనుమతించమని ఏపీ అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు, హైదరాబాద్‌లోని హాస్టల్ యాజమాన్యాలు విద్యార్థులు, ఉద్యోగులను బయటకు పంపవద్దని.. లాక్‌డౌన్ ముగిసే వరకు అందరినీ ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎవరికీ నిరభ్యంతర పత్రాలు జారీ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది.

First Published:  25 March 2020 9:45 PM GMT
Next Story