కెనడా భామకు క్వారెంటైన్ కష్టాలు

  • డేటింగ్ చేస్తామంటూ ఈ-మెయిళ్ల వరద
  • బాబోయ్! ఆపండంటూ ఈగ్వెన్ బుచార్డ్ మొర

కరోనా వైరస్ భయంతో.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఓవైపు గజగజలాడిపోతుంటే…మరోవైపు …కెనేడియన్ టెన్నిస్ బ్యూటీ ఈగ్వెన్ బుచార్డ్ మాత్రం.. క్వారెంటైన్ పై చేసిన కామెడీ కామెంట్ తో కోరి కష్టాలు కొని తెచ్చుకొంది.

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎవరికివారే బయటకు రాకుండా ఇంటిపట్టునే ఉండాలని, క్వారెంటైయిన్ అంటే బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా డేటింగ్ చేయడం లాంటిదని ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపింది.

ఇంకేముంది…బుచార్డ్ ను ఆట పట్టించడానికా అన్నట్లుగా వందలాదిమంది చిలిపికుర్రాళ్లు డేటింగ్ కు తాము సిద్ధమంటూ ఈ-మెయిల్స్ శరపరంపరగా పంపుతూ… కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ఈ-మెయిళ్ల వరదను తాను, తన వ్యక్తిగత కార్యదర్శి తట్టుకోలేకపోతున్నామని..తాను హాస్యానికి చేసిన కామెంట్ ను ఇంత సిరీయస్ గా తీసుకొంటారని అనుకోలేదంటూ..ఈ అందాలబరిణె లబోదిబోమంటోంది.

2014లో వింబుల్డన్ రన్నరప్ గా నిలిచిన ఈగ్వెన్ బుచార్డ్ కు..కురాళ్ల ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అయితే…కరోనా వైరస్ ను దీటుగా ఎదుర్కొనాలంటే, బారిన పడకుండా ఉండాలంటే స్వీయనియంత్రణ చాలా అవసరమని, దాని తీవ్రతను అందరూ గుర్తించాలంటూ విజ్ఞప్తి చేసింది. దయచేసి డేటింగ్ కోసం ఈ-మెయిల్స్ పంపరాదంటూ వేడుకొంది.

కరోనా వైరస్ దెబ్బతో టెన్నిస్ పోటీలన్నింటీనీ వాయిదా వేయటంతో 26 సంవత్సరాల బుచార్డ్ ప్రస్తుతం..ఇంటికే పరిమితమై తనకుతానుగా క్వారెంటెయిన్ పాటిస్తోంది.