వైఎస్ జగన్ కీలక నిర్ణయం… పరీక్షలు లేకుండానే పాస్..!

కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయనున్నారు. ఈ మేరకు సీఎం నిర్ణయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

కరోనా ప్రభావంతో ఇప్పటికే పాఠశాలలు మూత పడ్డాయని.. ఈ పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మంచిది కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు.

ఇప్పటికే పదో తరగతి పరీక్షలను వాయిదా వేశామని.. త్వరలోనే కొత్త టైంటేబుల్ ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. ఇక భోజన పంపిణీ విషయంలో అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని.. భోజనం వండే సమయంలో శుభ్రత పాటించాలని ఆయన చెప్పారు. గోరుముద్ద పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని సీఎం చెప్పినట్లు మంత్రి సురేష్ వివరించారు.