Telugu Global
National

పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం " డీజీపీ

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించారు. కాగా, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కొంత మంది ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు గురువారం స్వగ్రామాలకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్లలో ఎన్ఓసీ పత్రాలు తీసుకొని వాళ్లు సొంత వాహనాల్లో సరిహద్దులకు చేరుకున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న వందలాది మందిని పోలీసులు నిలిపివేశారు. కాగా, అర్థరాత్రి దాటిన తర్వాత వాళ్లు అక్కడ కాపలాగా ఉన్న పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. […]

పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం  డీజీపీ
X

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించారు. కాగా, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కొంత మంది ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు గురువారం స్వగ్రామాలకు బయలుదేరారు. హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్లలో ఎన్ఓసీ పత్రాలు తీసుకొని వాళ్లు సొంత వాహనాల్లో సరిహద్దులకు చేరుకున్నారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న వందలాది మందిని పోలీసులు నిలిపివేశారు. కాగా, అర్థరాత్రి దాటిన తర్వాత వాళ్లు అక్కడ కాపలాగా ఉన్న పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశమంతటా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటం గర్హనీయమన్నారు. అక్కడ పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న పరిస్థితులను అర్థం చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని మర్చిపోయి దాడులకు పాల్పడటం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు.

ప్రధాని, కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు లాక్‌డౌన్‌లో భాగంగా సరిహద్దులు మూసేసాం… గ్రామాలకు గ్రామాలే స్వీయ నిర్బంధంలోనికి వెళ్లిపోయాయి. కానీ కొంత మంది జిల్లాల సరిహద్దులను దాటుకొని రాష్ట్ర సరిహద్దును కూడా దాటడానికి బైక్, కార్లు, బస్సుల్లో వచ్చి ప్రోటోకాల్ ధిక్కరించారని ఆయన అన్నారు.

మానవతా దృక్పదంతో మెడికల్ టెస్టుల అనంతరం, క్వారంటైన్‌కు పంపుతామని… వాహనాలు కూడా సమకూర్చిన తర్వాత వాళ్లు దాడులకు పాల్పడ్డారని… చీకటి పడిన తర్వాత మూకుమ్మడిగా దాడి చేశారని… ఇది ఎంత మాత్రం సహించదగినది కాదని డీజీపీ అన్నారు.

దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నాం. వారికి తప్పకుండా చట్టప్రకారం శిక్ష పడుతుంది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం, మెడికల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌ను వ్యతిరేకించడం వాళ్లు చేసిన తప్పులని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు అక్కడే ఉండండి. తెలంగాణ ప్రభుత్వం మీకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చిందని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

First Published:  26 March 2020 9:42 PM GMT
Next Story