Telugu Global
National

కరోనాతో పోరులో ముగ్గురూ ముగ్గురే

నిన్నటి క్రీడాకారులు…నేటి పోలీసు అధికారులు లాక్ డౌన్ అమలులో కీలకపాత్ర పోషిస్తున్న మొనగాళ్లు కరోనా వైరస్ తో దేశమంతా ఓవైపు 21 రోజుల లాక్ డౌన్ తో అలుపెరుగని పోరాటం చేస్తుంటే…విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్ లాంటి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఇంటిపట్టునే ఉంటూ…ట్విట్టర్ సందేశాల ద్వారా ప్రజలను , అభిమానులను వేడుకొంటూ… పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీకి జేజేలు పలుకుతూ తమ భక్తిని చాటుకొంటున్నారు. మరోవైపు..2007 టీ-20 ప్రపంచకప్ విజేత జోగిందర్ శర్మ, ఆసియా కబడ్డీ […]

కరోనాతో పోరులో ముగ్గురూ ముగ్గురే
X
  • నిన్నటి క్రీడాకారులు…నేటి పోలీసు అధికారులు
  • లాక్ డౌన్ అమలులో కీలకపాత్ర పోషిస్తున్న మొనగాళ్లు

కరోనా వైరస్ తో దేశమంతా ఓవైపు 21 రోజుల లాక్ డౌన్ తో అలుపెరుగని పోరాటం చేస్తుంటే…విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్ లాంటి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఇంటిపట్టునే ఉంటూ…ట్విట్టర్ సందేశాల ద్వారా ప్రజలను , అభిమానులను వేడుకొంటూ… పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీకి జేజేలు పలుకుతూ తమ భక్తిని చాటుకొంటున్నారు.

మరోవైపు..2007 టీ-20 ప్రపంచకప్ విజేత జోగిందర్ శర్మ, ఆసియా కబడ్డీ గోల్డ్ మెడల్ విజేత అజయ్ ఠాకూర్, బాక్సర్ అఖిల్ కుమార్ మాత్రం… పోలీసు అధికారులుగా… కరోనా వైరస్ తో పోరాటంలో ఫ్రంట్ లైన్ సైనికులుగా పోరాడుతున్నారు.

సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2007 టీ-20 ప్రపంచకప్ లో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో ప్రపంచకప్ సాధించిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న స్వింగ్ బౌలర్ జోగిందర్ శర్మ…స్పోర్ట్స్ కోటాలో హర్యానా పోలీసుశాఖలో డీఎస్పీగా చేరి ప్రస్తుతం డిప్యూటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

హిస్సార్ లో జోగిందర్ సేవలు…

హిస్సార్ లో డిప్యూటీ పోలీసు కమిషనర్ గా పనిచేస్తున్న జోగిందర్ శర్మ…కరోనా వైరస్ తో పోరాటంలో పాల్గొనటం తనకో సవాలుగా, గొప్పఅనుభవంగా ఉందని ప్రకటించాడు. 2007 నుంచి తాను హర్యానా పోలీసులో ఉద్యోగిగా పలురకాల సవాళ్లు ఎదుర్కొన్నానని… అయితే లాక్ డౌన్ సమయంలో నిర్వర్తిస్తున్న విధులు మాత్రం కీలకమైనవని వ్యాఖ్యానించాడు.

లాక్ డౌన్ సమయంలో వీధుల్లోకి రావద్దని, గుంపులు గుంపులుగా గుమికూడవద్దని ప్రజలకు పలువిధాలుగా నచ్చచెబుతున్నామని, పరిస్థితి తీవ్రతను వారు సైతం అర్థం చేసుకొంటున్నారని తెలిపాడు.

ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాలలో ఇప్పటికే 5 లక్షలమందికి సోకడంతో పాటు 24వేలమంది ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ ను అధిగమించగలమన్న ధీమాను 36 సంవత్సరాల జోగిందర్ వ్యక్తం చేశాడు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విధులు నిర్వర్తిస్తున్నామని, కరోనా వైరస్ ను సామూహికంగా ఎదుర్కొనగలిగితేనే విజేతలుగా నిలువగలమని జోగిందర్ భావిస్తున్నాడు.

కరోనాపై ఇది లాక్ డౌన్ పంచ్…

కట్టలు తెంచుకోడానికి సిద్ధంగా ఉన్న కరోనా వైరస్ పై భారత ప్రజలంతా కలసి లాక్ డౌన్ పంచ్ విసరాలని, ఇది నాకౌట్ పంచ్ గా చరిత్రలో మిగిలిపోవాలని బాక్సర్ కమ్ సూపర్ పోలీస్ అఖిల్ కుమార్ చెప్పాడు.

ఆసియా బాక్సింగ్ , 2006 కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో భారత్ కు బంగారు పతకాలు సాధించడం ద్వారా హర్యానా పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం సంపాదించిన అఖిల్ కుమార్ ప్రస్తుతం…గురుగ్రామ్ లో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

లాక్ డౌన్ సమయంలో వీధుల్లోకి వచ్చే ప్రజలకు నచ్చచెబుతున్నామని, వారిబాధ్యత ఏమిటో వివరిస్తున్నామని 38 ఏళ్ల అఖిల్ వివరించాడు. తన 38వ పుట్టినరోజును.. హర్యానా వీధుల్లో విధినిర్వహణలో పాల్గొనడం ద్వారా జరుపుకోడం సంతృప్తిగా ఉందని చెప్పాడు.

రెండుసార్లు ఒలింపియన్ అఖిల్ కుమార్ తన స్నేహితులతో కలసి నిధులు సేకరించడంతో పాటు…పేదవారికి ఆహారపదార్థాలు అందించే పనిని కూడా చేపట్టాడు.

మరో బాక్సర్ కమ్ డీఎస్పీ జితేందర్ కుమార్ సైతం నిధుల సేకరణతో పాటు పోలీసు విధులను అంకితభావంతో నిర్వర్తిస్తున్నాడు.

ప్రజలకు అవసరమైన మాస్క్ లు, వైద్యపరికరాలు అందిస్తున్నాడు. రోహ్ టక్ లో నివాసం ఉంటున్న తన భార్య, పిల్లలు తనకు రోజూ ఫోను చేసి యోగక్షేమాలు కనుక్కొంటున్నారని, తన గురించి ఆందోళన చెందుతున్నారని… అయినా తనకు డ్యూటీనే ప్రధానమని అఖిల్ కుమార్ చెబుతున్నాడు.

ఆసియా క్రీడల కబడ్డీలో బంగారు పతకం సాధించడం ద్వారా హర్యానా పోలీసులో డీఎస్పీగా చేరిన అజయ్ ఠాకూర్ సైతం… కరోనా వైరస్ తో లాక్ డౌన్ పోరాటంలో పాల్గొంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు.

భారత జాతీయజట్లలో సభ్యులుగా అంతర్జాతీయ పోటీలలో ప్రత్యర్థిజట్లతో పోరాడిన ఈ ముగ్గురు మొనగాళ్లు… ఇప్పుడు పోలీసు అధికారులుగా కరోనా వైరస్ తో సైతం పోరాడటం గర్వకారణమే మరి. దొరకునా ఇటువంటి సేవ అంటే ఇదే మరి.

First Published:  27 March 2020 10:56 PM GMT
Next Story