Telugu Global
NEWS

కరోనాపై పోరాటానికి సర్వం సిద్దం

60వేల మందికి వచ్చినా చికిత్స చేస్తాం గచ్చిబౌలిలో 1400 పడకల ఐసీయూ సెంటర్ ఏప్రిల్ 15 వరకు లాక్‌డౌన్ రైతుల పంటలకు ఇబ్బంది లేదు తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సర్వం సన్నద్దమైందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో వ్యాది విజృంభించినా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్దం చేశామని ఆయన అన్నారు. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ పరిస్థితిపై ఆయన అన్ని శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. […]

కరోనాపై పోరాటానికి సర్వం సిద్దం
X
  • 60వేల మందికి వచ్చినా చికిత్స చేస్తాం
  • గచ్చిబౌలిలో 1400 పడకల ఐసీయూ సెంటర్
  • ఏప్రిల్ 15 వరకు లాక్‌డౌన్
  • రైతుల పంటలకు ఇబ్బంది లేదు
  • తెలంగాణ సీఎం కేసీఆర్

కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సర్వం సన్నద్దమైందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో వ్యాది విజృంభించినా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్దం చేశామని ఆయన అన్నారు. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ పరిస్థితిపై ఆయన అన్ని శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు పలు విషయాలు వివరించారు. రాష్ట్రంలో 60 వేల మంది కరోనా బారిన పడ్డా వారికి చికిత్స చేయడానికి సకల ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.

శుక్రవారం రోజు ఎక్కువగా పాజిటీవ్ కేసులు వచ్చాయని కేసీఆర్ వివరించారు. రాష్ట్రం మొత్తం మీద 20 వేల మంది క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఏప్రిల్ 15 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని.. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని.. నిర్లక్ష్యంగా బయట తిరగొద్దని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వాల మాట వినకపోవడం వల్ల అమెరికా ఇప్పుడు చాలా బాధపడుతోందన్నారు. న్యూయ్యార్క్ సిటీలో అత్యధిక కేసులు నమోదవడమే కాకుండా మరణాలు కూడా ఎక్కువ సంభవిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ఇందు కోసం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఇక రాష్ట్రంలో 1400 ఐసీయూలు సహా 12,400 పడకలు సిద్దం చేసినట్లు కేసీఆర్ చెప్పారు. మరో 500 వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ కేంద్రాన్ని సిద్దం చేస్తున్నామన్నారు. 11 వేల మంది రిటైర్డ్ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. రోగ నిర్థారణకు ప్రభుత్వ ల్యాబ్స్ సరిపోకపోతే ప్రైవేటు ల్యాబ్స్‌కు అవకాశం కల్పిస్తామని.. అలాగే సీసీఎంబీని కూడా వాడుకుంటామని ఆయన చెప్పారు. సీసీఎంబీలో రోజుకు 800 మందికి వ్యాది నిర్థారణ పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు.

మన ప్రాంతంలో పండే పండ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవద్దని ఆయన చెప్పారు. పండ్ల వాహనాలను, పాలు, కూరగాయలు, నిత్యావసర సరకుల వాహనాలను అడ్డుకోమని… పశుగ్రాసం తీసుకెళ్లే వాహనాలకు కూడా తిరగడానికి అనుమతి ఇస్తున్నామని.. దీనికి సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ప్రజలందరూ చికెన్, గుడ్లు ఎక్కువ సంఖ్యలో తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలిన కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనిపై దుష్ర్పచారాలను నమ్మొద్దన్నారు.

రాష్ట్రంలో ఏప్రిల్ 10 వరకు సాగునీటిని విడుదల చేస్తామని.. నేరుగా లేదా ఆన్ ఆఫ్ పద్దతిలో నీళ్లు అందుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఏప్రిల్ 10 వకు నీళ్లు వదులుతామని.. అలాగే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తామన్నారు.

ఇక పంటలను మార్కెట్ యార్డులకు తేవొద్దని.. మార్కెట్ సిబ్బంది ప్రతీ గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొంటామన్నారు. రైతుల బ్యాంకు అకౌంట్లో నేరుగా డబ్బులు పడతాయన్నారు. ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుందని రైతులు ఈ విషయంలో కంగారు పడొద్దని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  27 March 2020 9:58 PM GMT
Next Story