తొలి కరోనా బాధితురాలు గుర్తింపు… బతికే ఉంది!

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. మూడు లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా… 30 వేల మరణాలు సంభవించాయి. కాగా, అసలు ఈ వైరస్ తొలి సారి ఎవరికి సోకిందనే విషయంపై ఆంగ్ల పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ అన్వేషించింది. ఎట్టకేలకు తొలిసారి కరోనా పేషెంట్ ఆచూకీ కనుగొంది. నెల రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ప్రాణాలతో బయటపడినట్లు స్పష్టం చేసింది. వూహాన్ సీఫుడ్ మార్కెట్లో ఆమె రొయ్యలు విక్రయించేది.

వూహాన్‌లో అతిపెద్ద సీఫుడ్ మార్కెట్ ఉంది. అక్కడే వుయ్ జుషాన్ అనే మహిళ రొయ్యలను విక్రయించేది. గత ఏడాది డిసెంబర్ 10న ఆమె కోవిడ్ 19 లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. కానీ వైద్యులు అది సాధారణ జలుబుగా భావించి ఒక ఇంజెక్షన్ ఇచ్చి పంపించేశారు.

అయితే జుషాన్‌కు వ్యాది నయమవకపోగా పూర్తిగా బలహీనపడింది. దీంతో డిసెంబర్ 16న వుహాన్ యూనియన్ ఆసుపత్రిలో చేరింది. అక్కడే ఆమెకు అరుదైన వైరస్ వల్ల కలిగే వ్యాది సోకినట్లు వైద్యులు తేల్చారు. అప్పటికే ఈమె వ్యాపారం చేసే వూహాన్ మార్కెట్లో చాలా మంది ఇవే లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. అప్పుడు గాని అది ప్రమాదకరమైన కోవిడ్ 19గా గుర్తించారు. దీంతో ఆమెను క్వారంటైన్‌లో పెట్టారు.

ఆమెకు ఈ వ్యాది ఎలా వచ్చిందో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె వూహాన్ మార్కెట్లోని టాయిలెట్ వినియోగించడం వల్ల ఈ వ్యాది సోకిందని.. అదే టాయిలెట్ మార్కెట్లోని చాలా మంది వినియోగించినట్లు తెలిసింది. అపరిశుభ్రత కారణంగా ఈ వ్యాది మార్కెట్లో వారికి త్వరగా వ్యాపించింది.

క్వారంటైన్‌లో ఉన్న జుషాన్ గత జనవరిలోనే కోలుకొని ఇంటికి వెళ్లిపోయింది. కాగా, ఈ వైరస్‌పై ది స్కూల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, చైనా ప్రొఫెసర్లు కలిసి చేసిన పరిశోధనల ఆధారంగా వాల్‌స్ట్రీట్ జర్నీ కోవిడ్ 19 ఎక్కడ ప్రారంభమై.. ఎవరి నుంచి సోకిందని నిర్థారించింది.