ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ… పేదలకు ఊరట !

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లోనికి వెళ్లింది. కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, ప్రైవేటు సంస్థలు మూతపడటంతో పాటు గృహ నిర్మాణాలు కూడా ఆగిపోవడంతో రోజు వారీ కూలీలు, వేతన జీవులు నానా అవస్థలు పడుతున్నారు.

ముఖ్యంగా పని చేస్తే గాని పూటగడవని నిరుపేదలు నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ తెల్లరేషన్ కార్డుదారులకు మార్చి 29 నుంచి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తానని ప్రకటించారు.

సీఎం ఆదేశాల ప్రకారం ఆదివారం నుంచి పౌరసరఫరాల శాఖ చౌకదుకాణాల ద్వారా ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది. ప్రతీ కార్డుదారునికి ఇంటిలో ఒక్కో మనిషికి 5 కేజీల చొప్పున బియ్యం, కేజి కందిపప్పు, చక్కెర పంపిణీ చేశారు.

ఏప్రిల్ 15 వరకు ఈ రేషన్ పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పేదలకు కాస్త ఊరట లభించినట్లైంది. రాష్ట్రంలోని రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు గుంపులు గుంపులుగా రాకుండా.. క్రమ పద్దతిని పాటించాలని కోరింది.

ప్రజా ప్రతినిధులు కూడా రేషన్ షాపుల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. రేషన్ షాపుల ఎదుట మార్కింగ్ చేసి సామాజిక దూరం పాటించాలని సీఎం చెప్పారు.

కాగా, లాక్‌డౌన్‌తో ఎలా బతకాలి అన్న భయం కలిగిందని, ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం వైస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం తమకు ఊరట కలిగించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు ఆహారానికి ఇబ్బంది పడకుండా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కి తాము రుణపడి ఉంటామన్నారు.