అంతర్‌ రాష్ట్ర సరిహద్దులు మూసేయండి – కేంద్రం అల్టిమేటం

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినం చేసింది. పలు నగరాల్లో పనులు లేక రోజూ వారీ వలస కూలీలు సొంత గ్రామాలకు చేరుకోవడానికి బయలుదేరారు.

శుక్ర, శనివారాల్లో ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్టాండ్ దగ్గరకు యూపీ, బీహార్‌కు చెందిన లక్షలాది మంది ప్రజలు చేరుకోవడం వివాదంగా మారింది. వారిని తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి యూపీ ప్రభుత్వం 1000 బస్సులను ఏర్పాటు చేసింది.

కాగా, ఈ ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని వ్యాఖ్యానించింది.

సొంత గ్రామాలకు వెళ్లే వారు ఎక్కువై పోతుండటంతో కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఆదివారం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సొంత రాష్ట్రాలకు చేరుకునే వలస కూలీలను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని రాజీవ్ గౌబా ఆదేశించారు.

ఈ రోజు నుంచి రాష్ట్రాల సరిహద్దులను మూసేయాలని.. వలస కూలీలు గాని ఇతరులు గాని ఎవరూ సరిహద్దులు దాటడానికి వీళ్లేదని ఆయన చెప్పారు.

సాధ్యమైనంత వరకు జాతీయ రహదారుల పక్కన క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి వారిని అక్కడే 14 రోజుల పాటు ఉంచాలని ఆయన చెప్పారు.

కరోనా కట్టడికి వీలైనంత వరకు కఠినంగా వ్యవహరించాల్సిందేనని ఆయన సూచించారు. ప్రతీ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకొని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు.