జుమాంజీ హీరోయిన్ కు కరోనా

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా హాలీవుడ్ ను కుడా విడిచిపెట్టలేదు. ఇప్పటికే ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అతడు చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓల్గా కుర్లేంకోకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె మాస్కోలోని తన నివాసంలోనే ఉంటూ చికిత్స పొందుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కు కూడా కరోనా సోకింది.

జుమాంజీ సినిమాలో హీరోయిన్ గా నటించిన లారా బెల్ బండీకి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని లారా స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపిన ఈ 38 ఏళ్ల నటి.. కొద్ది రోజులుగా దగ్గు, జలుబు, తలనొప్పి, ఛాతినొప్పి, జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడించింది. ఎన్ని రోజులైనా తగ్గకపోవడంతో పరీక్షలు చేయించుకున్నానని, తనకు కరోనా సోకినట్టు వైద్యులు చెప్పారని తెలిపింది లారా.

అయితే కరోనా సోకినందకు తనకు భయం కలగలేదంటోంది లారా. తనలానే అంతా ధైర్యంగా ఉండాలని.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తోంది. వైద్యుల సలహా మేరకు మందులు తీసుకొని, మంచి ఆహారం తీసుకుంటే కరోనా ఆటోమేటిగ్గా తగ్గిపోతుందని సలహా ఇస్తోంది. దయచేసి ఎవ్వరూ బయటకు రావొద్దని సూచిస్తోంది లారా. 1995లో వచ్చిన జుమాంజీ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఈమెకు ఎనలేని పేరు తీసుకొచ్చింది.