Telugu Global
National

క్రీడా ప్రపంచానికి లాక్ డౌన్ టెస్ట్

క్రీడాకారులకు మానసిక పరీక్షే అంటున్న ప్రముఖులు భారత కుటుంబవ్యవస్థే శ్రీరామ రక్ష అంటున్న నిపుణులు క్రీడలే వృత్తిగా చేసుకొన్న నేటి ఆధునికతరం క్రీడాకారులకు.. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న కరోనా వైరస్ లాక్ డౌన్ ఓ పరీక్షేనని, భయం, ఆందోళన, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం లాంటి సరికొత్తగా మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు, నిన్నటితరం ప్లేయర్లు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. అనుబంధం, ఆప్యాయతల పొదరిల్లులాంటి భారత కుటుంబ వ్యవస్థే ఈ సమస్యలకు విరుగుడని మరికొందరు చెబుతున్నారు. క్రీడాకారులకు […]

క్రీడా ప్రపంచానికి లాక్ డౌన్ టెస్ట్
X
  • క్రీడాకారులకు మానసిక పరీక్షే అంటున్న ప్రముఖులు
  • భారత కుటుంబవ్యవస్థే శ్రీరామ రక్ష అంటున్న నిపుణులు

క్రీడలే వృత్తిగా చేసుకొన్న నేటి ఆధునికతరం క్రీడాకారులకు.. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న కరోనా వైరస్ లాక్ డౌన్ ఓ పరీక్షేనని, భయం, ఆందోళన, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం లాంటి సరికొత్తగా మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు, నిన్నటితరం ప్లేయర్లు భావిస్తున్నారు.

మరికొందరు మాత్రం.. అనుబంధం, ఆప్యాయతల పొదరిల్లులాంటి భారత కుటుంబ వ్యవస్థే ఈ సమస్యలకు విరుగుడని మరికొందరు చెబుతున్నారు.

క్రీడాకారులకు విషమ పరీక్షే…

మరో నాలుగు మాసాలలో టోక్యో ఒలింపిక్స్, మరో ఏడుమాసాలలో టీ-20 ప్రపంచకప్, మరెన్నో అంతర్జాతీయ పోటీలు, ఒలింపిక్స్ అర్హత సమరం, రెండువారాలకోసారి
జరిగే సిరీస్ లు, రకరకాల టోర్నీలతో బిజీబిజీగా ఉండాల్సిన క్రీడాకారులు…కరోనా వైరస్ దెబ్బతో, లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

నిత్యం ప్రాక్టీసు… పొరుగు ప్రాంతాలు, దేశాలకు ప్రయాణం చేస్తూ మ్యాచ్ లు వెంట మ్యాచ్ లు ఆడేస్తూ, ఊపిరి సలపని షెడ్యూలుతో గత సంవత్సరాలుగా గడుపుతూ
వచ్చిన క్రీడాకారులంతా పనిపాటా లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సి రావడం అంటే నిజంగా ఓ సవాలేనని, మానసికంగా సరికొత్త సమస్యలు సృష్టించే ప్రమాదం ఉందని
ఆస్ట్ర్రేలియా మాజీ ఓపెనర్, ప్రస్తుత క్రికెట్ కోచ్ జస్టిన్ లాంగర్ అంటున్నారు.

ప్రధానంగా ఏమాత్రం అనుభవం లేని యువక్రికెటర్లు స్నేహితులకు దూరమై ఒంటరితనాన్ని భరించవలసి రావడం ఓ పరీక్షేనని భావిస్తున్నారు.

భారత కుటుంబవ్యవస్థే కీలకం…

మరోవైపు… భారత మాజీ క్రికెటర్లు మనిందర్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, బెంగాల్ రంజీ కెప్టెన్ మనోజ్ తివారీ మాత్రం… ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వాత్సల్యం, అభిమానం కలగలసిన భారత కుటుంబ వ్యవస్థ, ఒకరికోసం ఒకరుగా భావించే జీవన విధానమే… ఈ సమస్య నుంచి క్రీడాకారులను గట్టెక్కిస్తుందని, ఇది శ్రీరామరక్షలా పనిచేస్తుందని చెబుతున్నారు.

పశ్చిమదేశాల జీవన విధానంతో పోల్చిచూస్తే… భారత్ కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగా ఉందని మనిందర్ సింగ్ గుర్తు చేస్తున్నారు. సాధారణంగా విదేశీ టూర్లతో తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే క్రీడాకారులు, ప్రధానంగా క్రికెటర్లు… కరోనా బ్రేక్ తో ఇంటిలోనే ఉండిపోవాల్సి రావడం ఓ విధంగా వరం లాంటిదేనని బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ అంటున్నాడు.

కుటుంబసభ్యులతో కలసి ఉండటం, తన కుమారుడికి రోజూ ఆహారం ఇవ్వడం, అమ్మానాన్నలు, భార్యతో కలసి భోజనం చేసే అవకాశం రావడం అదృష్టమని చెప్పాడు.

ఆర్థికభరోసా ఏదీ?

ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, అమెరికాలాంటి దేశాలలో… లాక్ డౌన్ లాంటి పరిస్థితుల్లో జీవనోపాథికి దూరమైతే… ప్రభుత్వాలే నిరుద్యోగులకు అండగా నిలుస్తాయని, సోషల్ సెక్యూరిటీ ద్వారా భద్రత కల్పిస్తాయని… అదే మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేనేలేదని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశాడు.

రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవస్థ మనదని, పనిపాట లేకుండా 21 రోజులపాటు ఇంటిపట్టునే ఉండటం పలురకాలుగా ఆర్థికసమస్యలు సృష్టించే ప్రమాదం లేకపోలేదని… ఇర్ఫాన్
హెచ్చరించాడు.

చేతిలో చిల్లిగవ్వలేకుండా ఇంట్లో కూర్చుంటే… లోకువయ్యే ప్రమాదం, చిన్నచిన్న ఘర్షణలు చోటుచేసుకొనే ప్రమాదం సైతం ఉందని హెచ్చరించాడు.

ఒకరినొకరు భరించగలిగితేనే…

ఆధునిక జీవనశైలిలో భాగంగా చిన్నకుటుంబాలతో ఎవరికివారే బతకడం నేర్చుకొన్నామని, భార్యాపిల్లలు మినహా సొంతకుటుంబసభ్యులనే భరించే స్థితిలో లేకుండా పోయామని… ఇలాంటి భరించలేని మనస్తత్వం, స్వార్థపూరిత జీవనశైలి…లాక్ డౌన్ కాలంలో ఘర్షణలు, సమస్యలకు కారణమైనా ఆశ్చర్యపోనక్కరలేదని… భారత మాజీ లెఫ్టామ్ స్పిన్నర్, క్రికెటర్ కామెంటీటర్ మనిందర్ సింగ్ హెచ్చరించాడు.

బ్యాంకు అకౌంట్లో వందల కోట్ల రూపాయల బ్యాలెన్స్, లంకంత కొంప, సొంత జిమ్ , విలాసవంతమైన జీవనశైలి కలిగిన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీ
లాంటి క్రికెటర్లకు.. .లాక్ డౌన్ నిజంగా దేవుడిచ్చిన వరంలాంటిదే.

ఆటలనే జీవనంగా చేసుకొన్న దిగువ తరగతి , గ్రామీణ క్రీడాకారులకు మాత్రం లాక్ డౌన్ సమయం.. అశనిపాతం లాంటిదే.

అన్నీ ఉన్నవారికి రోగం అంత సుఖం మరొకటి లేదన్నసామెత… ఈ లాక్ డౌన్ సమయంలో కొందరికి అతికినట్లు సరిపోతుంది.

First Published:  28 March 2020 9:36 PM GMT
Next Story