రాథికా ఆప్టే భయపెట్టింది….

బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించిన రాథికా ఆప్టే నిన్నంతా భయపెట్టేసింది. ఆమెకు కరోనా సోకిందంటూ వదంతులు వ్యాపించడంతో అంతా అవాక్కయ్యారు. ఈ పుకార్లకు కారణం కూడా రాథికా ఆప్టేనే. ఓ హాస్పిటల్ లో ముఖానికి మాస్క్ వేసుకొని దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది.

ఆ ఫొటో చూసిన జనాలంతా ఆమెకు కరోనా వచ్చిందని భావించారు. దీంతో మీడియా అంతా అటు డైవర్ట్ అయింది. రాథికా ఆప్టేకు కరోనా వచ్చిందంటూ కథనాలు రాసేశారు. కొంతమంది ఆమెకు ఫోన్లు కూడా చేసి పరామర్శించారు. తనకు తెలియకుండానే, తను పెట్టిన ఫొటో ఇంత రచ్చ చేసిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించింది రాథిక.

వెంటనే మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చింది. తనకు కరోనా రాలేదని స్పష్టంచేసింది. కనీసం కరోనా పరీక్షల కోసం కూడా తను హాస్పిటల్ కు వెళ్లలేదని, మరో ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ కు వెళ్లానని తెలిపింది. ఎందుకైనా మంచిదని ముఖానికి మాస్క్ వేసుకున్నానని, దాన్ని అంతా అపార్థం చేసుకున్నారని అంటోంది. రాథికా ఆప్టే క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.