ఇలా దొరికేశావేంటి బండ్ల!

అవకాశం దొరికితే పవన్ కల్యాణ్, చిరంజీవిని ఆకాశానికి ఎత్తేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు బండ్ల గణేశ్. ఈ విషయంలో చాలాసార్లు అతడు సక్సెస్ అయ్యాడు. ఏదైనా ఫంక్షన్ లోనైనా లేదా సోషల్ మీడియాలోనైనా మెగాబ్రదర్స్ ను పొగుడుతూ చాలానే మైలేజీ సంపాదించాడు ఈ బిజినెస్ మేన్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్. అయితే తాజాగా బండ్ల చేసిన ఓ పని మాత్రం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఈ విషయంలో చిన్నపాటి ట్రోలింగ్ కు గురయ్యాడు అతడు.

ఆచార్యదేవోభవ అంటూ ఆచార్య పోస్టర్ ను షేర్ చేశాడు బండ్ల గణేష్. అదేంటి.. చిరంజీవి నటించిన ఆచార్య ఫస్ట్ లుక్, టైటిల్ డిజైన్ ఇంకా బయటకు రాలేదు కదా. మరి బండ్ల షేర్ చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. సరిగ్గా ఇక్కడే మెగా ఫ్యాన్స్ కు కోపం వచ్చింది.

నిజానికి బండ్ల షేర్ చేసింది ఒరిజినల్ కాదు. ఎవరో అభిమాని తయారుచేసిన ఫేక్ పోస్టర్ ను అతడు షేర్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ బండ్లపై ఫైర్ అయ్యారు. మీలాంటి వ్యక్తి ఇలాంటి ఫేక్ పోస్టర్లు షేర్ చేస్తే, చాలామంది దాన్నే నిజం అని భావించే అవకాశం ఉందని, దయచేసి ఇలాంటి పనులు మానుకోవాలని సుతారంగా చురకలు అంటించారు. కనీసం ఈ పోస్టర్ ను షేర్ చేసినప్పుడు ఫ్యాన్ మేడ్ అనే విషయాన్ని బండ్ల ప్రస్తావించినా అతడికి సోషల్ మీడియాలో తిట్లు తప్పేవి.