డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటే ఇంటికే మద్యం..!

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో నిత్యావసర దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, పాలు, పండ్లు, మెడికల్ షాపులు తప్ప ఏవీ తెరవట్లేదు. గత 10 రోజులుగా మద్యం దుకాణాలు మూతబడటంతో మందుబాబులకు పిచ్చెక్కిపోతోంది. నిత్యం మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్లు టైంకి పెగ్గు పడక చేతులు, కాళ్లు వణకడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలయ్యాయి. దీంతో మద్యం దుకాణాలు తెరవాలని పలువురి విజ్ఞప్తులు మొదలయ్యాయి.

మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే కేరళలో కూడా మందు బాబులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే మద్యానికి బానిసలుగా మారిన వాళ్లు మందు దొరకక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మద్యం తాగకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కుంటున్న వారికి ఊరటగా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో మద్యం కొనుగోలుకు అవకాశం ఇచ్చారు. వారి ప్రిస్కిప్షన్ పరిశీలించి అవసరమైన మోతాదు మద్యాన్ని ఇంటికే డెలివరీ చేయనున్నారు. తప్పుడు ప్రిస్కిప్షన్ ఇచ్చినా, దాఖలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు మద్యం మానేయాలనుకునే వారికి డీఅడిక్షన్ సెంటర్లు ప్రారంభించాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా వారికి అవసరమైన చికిత్సలు, వైద్యం ఉచితంగా అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.