అనుకున్నదొక్కటి…. అవుతోందొక్కటి!

  • మార్కెట్లకు గుంపులుగా ప్రజలు
  • పాటించని సామాజిక దూరం
  • ఇలాగైతే కరోనా తగ్గేదెలా..?

‘ఆదివారం కేవలం రెండు కరోనా పాజిటీవ్ కేసులే నమోదయ్యాయి.. లాక్‌డౌన్ ఇలాగే సమర్థవంతంగా కొనసాగితే ఏప్రిల్ 7 నాటికి తెలంగాణ కరోనా ఫ్రీగా తయారవుతుంంది’ అని కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్‌లో ప్రకటించారు.

ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్లందరికీ ఎంతో ఊరట కలిగింది. కరోనా కొన్ని రోజుల్లో దూరమవుతోందనే ఆశ కలిగింది. ఇదంతా ప్రజల సహకరించడం వల్లేనని.. లాక్‌డౌన్‌ నిబంధనలు, సామాజిక దూరం పాటించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కానీ నిజంగా క్షేత్ర స్థాయిలో అలా ఉందా..? ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారా..? అంటే కాదనే చెప్పాలి.

లాక్‌డౌన్‌లో తొలి ఆదివారం ప్రజలు ఒక్కసారిగా రోడ్లెక్కారు. కూరగాయలు, మాంసం, చికెన్ కోసం మార్కెట్లకు గుంపులు గుంపులుగా చేరారు. మొఖానికి మాస్కులు, చేతులకు గ్లౌవ్స్ లు ధరించినా కూడా సామాజిక దూరం ఏమాత్రం పాటించలేదు.

అసలు ఒక్కరి ముఖాల్లో కూడా కరోనా ఆందోళన కనిపించలేదు. అసలు వైరస్ మమ్మల్నేం చేస్తుందిలే అనే అతి నమ్మకంతో మార్కెట్లకు తరలివచ్చారు. ప్రభుత్వం రోజూ ఎన్ని హెచ్చరికలు చేసినా పెడచెవిన పెట్టారు.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో… ఇప్పటికే మూడో స్టేజ్‌కు వెళ్లకుండా ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు అమలు చేస్తున్నా…. ప్రజలకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు.

గత ఆదివారం జనతా కర్ఫ్యూ అనంతరం సోమవారం ప్రజలు ఎలాగైతే మార్కెట్లకు, కిరాణా షాపులకు పోటెత్తారో.. నిన్న కూడా సేమ్ అలాంటి సీనే రిపీటైంది. ప్రతీ ఆదివారం మాంస ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరినట్లే నిన్న కూడా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు.

బోరబండలోని లోని ఒక దుకాణంలో అమ్మకందారులు కూడా కనీసం మాస్కులు, గ్లౌవ్స్ లు ధరించకుండా అమ్మకాలు సాగించడంతో జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించాల్సి వచ్చిందంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

నిత్యం రద్దీగా ఉండే గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్‌కు రిటైల్ వ్యాపారులు భారీగా చేరుకున్నారు. వారు కరోనా నేపథ్యంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. రిటైల్ వ్యాపారులతో పాటు తక్కువ ధరకు దొరుకుతాయనే ఆలోచనతో సామాన్య జనం కూడా మార్కెట్‌కు రావడంతో కిక్కిరిసి పోయింది. ఆ జనాన్ని చూసి కొంత మంది భయపడి గేటు వద్ద నుంచే వెనుదిరిగిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు.

వనస్థలిపురం రైతు బజార్‌కు కూడా ప్రజలు భారీగా తరలిరావడంతో ఆదివారం దాన్ని తాత్కాలికంగా మూసేసారు. సోమవారం నుంచి అక్కడ మార్కెట్ తెరవొద్దని సమీపంలోని హుడాపార్క్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మరోవైపు ప్రతీ రోజు తెరిచి ఉంచే నిత్యావసర దుకాణాలు, మెడికల్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది. అయినా చాలా చోట్ల అసలు ఈ నిబంధనలను పాటించట్లేదు. పది నుంచి పదిహేను మంది ఒకే చోట గుంపుగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో కరోనా త్వరగా వ్యాపించే అవకాశం ఉంది.

ప్రభుత్వం క్షేత్ర స్థాయికి వచ్చి అందరినీ బెత్తం పట్టుకొని క్రమశిక్షణలో పెట్టలేదు. ప్రజలే దీన్ని తమ వంతు బాధ్యతగా పాటించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి చైన్ తెగాలంటే లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందే.

ఇప్పటికైనా ఇంటికే పరిమితమవుతూ.. మార్కెట్‌కి వెళ్తే సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే కేసీఆర్ చెప్పినట్లు ఏప్రిల్ 7 నాటికి ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టే అవకాశమే లేదని నిపుణులు అంటున్నారు.