శవాల మీద పేలాలు ఏరుకోవడం కాదు…. జర్నలిస్టుకు కేసీఆర్‌ క్లాస్‌

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఐదున్నరేళ్ల పాలనలో ఇన్ని ప్రెస్‌మీట్లు కేసీఆర్‌ ఎప్పుడూ పెట్టలేదు.

కరోనాపై ప్రజలను అలర్ట్‌ చేస్తూ కేసీఆర్‌ ప్రతి రెండురోజులకొకసారి మీడియా ముందుకు వస్తున్నారు. ప్రజలకు ప్రస్తుత పరిస్థితులను అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అవసరమైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నామో ప్రజలకు చెబుతున్నారు. ఆచర్యల వల్ల కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? అనేవి ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నారు. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు చూసినవారు చాలా మంది ఇంప్రెస్‌ అవుతున్నారు. అయితే ఆయన ప్రెస్‌మీట్‌కు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక జర్నలిస్టు మాత్రం దొరికిపోతున్నారు. వారికి గట్టి క్లాస్‌ పీకుతున్నారు. తాజాగా రేషన్‌ ఉచిత సరఫరాపై కేంద్రం సాయం చేయడం లేదా? అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నపై కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు.

ప్రశ్న అడిగినపుడు సమాధానం కూడా వినాలని గట్టిగా హెచ్చరించారు. ఎక్స్‌ట్రాలు అడిగేవారికి ఎక్స్‌ట్రాలు చెప్పాల్సి వస్తదని….కేంద్ర ప్రభుత్వం వేరా?…రాష్ట్ర ప్రభుత్వం వేరా? అంటూ ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం కరెక్ట్‌ కాదని అన్నారు. ప్రజలకు అవసరమైన రేషన్‌ ఇవ్వడానికి కేంద్రం చేయాల్సిన సాయం చేస్తుంది… రాష్ట్రం చేయాల్సిన పనిని రాష్ట్రం చేస్తుందని అన్నారు.

తమిళనాడులో సునామీ వచ్చినపుడు తాను మంత్రిగా వ్యవహరించిన తీరును కేసీఆర్‌ చెప్పారు. కేంద్ర కార్మిక శాఖామంత్రిగా ఉన్న సమయంలో 300 మంది డాక్టర్లు, 50 వేల మెడిసిన్‌ను తాను చొరవ తీసుకుని పంపించానని అన్నారు. విపత్తు సమయంలో దేశం మొత్తం ఒకటై పోరాడుతుందని అన్నారు. ఈ విషయం తెలుసుకుని ప్రశ్నలు వేయాలని, చిల్లర ప్రశ్నలు వేయొద్దని జర్నలిస్టును మందలించారు. రేషన్‌ పోర్టబులిటీపై ఓ రిపోర్టర్‌ ప్రశ్న అడిగితే… నీకు ప్రశ్న అడగడం రాదు అంటూ తీసిపారేశారు.

మొత్తానికి కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు జర్నలిస్టులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఏ ప్రశ్న అడిగితే…ఆయన ఎలా రియాక్ట్‌ అవుతారో… తమకు ఎలాంటి పంచ్‌ వేస్తారో అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి… ప్రశ్నలు వేస్తున్నారట.